
మెదక్ (శివ్వంపేట), వెలుగు: వడ్లు కొనడం లేదని శివ్వంపేట మండలంలోని రెడ్యా తండా రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం తూప్రాన్ - నర్సాపూర్ మెయిన్ రోడ్డు మీద ముండ్ల కంప, మొద్దులు అడ్డుగా పెట్టి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామ పంచాయతీ పరిధిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చెయ్యలేదని, వడ్లు తీసుకొని శివ్వంపేటలోని సొసైటీ కొనుగోలు కేంద్రానికి పోతే కాంటా పెట్టడం లేదని మండిపడ్డారు. నిర్వాహకులను అడిగితే గోమారం వెళ్లాలని చెబుతున్నారని, అక్కడికి వెళ్లినా ఇదే పరిస్థితి ఉందని వాపోయారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్ చారి రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
వడ్లను మిల్లులకు తరలిస్తలేరని..
మెదక్ (వెల్దుర్తి), వెలుగు: కాంటా పెట్టి వారం రోజులైనా ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించడం లేదని వెల్దుర్తి మండల రైతులు మండిపడ్డారు. మంగళవారం వెల్దుర్తి మెయిన్ రోడ్డు మీద ముళ్ల కంచె అడ్డుగా పెట్టి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని, చేతకొచ్చిన ధాన్యాన్ని సెంటర్‌కు తీసుకొస్తే ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంటా పెట్టి వారమైనా లారీల కొరత ఉందని మిల్లులకు తరలించడం లేదని మండిపడ్డారు. అంతేకాదు త్వరగా తూకం వేయాలంటే సంచికి అదనంగా 1.3 కిలో తరుగు తీస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని కోరారు.