మూడు నెలల్లో రైతుబజార్ పూర్తి చేస్తాం ? : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

మూడు నెలల్లో రైతుబజార్ పూర్తి చేస్తాం ? : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 
  • మంచుకొండలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

ఖమ్మం టౌన్, వెలుగు :  రఘునాథపాలెం మండలంలో కూరగాయలు పండించుకునే రైతులకు లాభం చేకూర్చేలా మంచుకొండలో మూడు నెలల్లో రైతు బజార్ నిర్మాణం పూర్తి చేస్తామని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం మండలంలోని మంచుకొండ గ్రామంలో సీఎస్ఆర్  కింద నిర్మిస్తున్న రైతు బజార్,  ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అదనపు సదుపాయాల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల ప్రోత్సాహంతో సింజెంటా కంపెనీ అంతర్జాతీయ కంపెనీగా ఎదిగిందని, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రైతులకు అవసరమైన పనులు చేసేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ రైతుబజారుతో మండలంలోని పేద, గిరిజన రైతులకు లాభం చేకూరనుందని తెలిపారు. అవసరమైతే కూరగాయలు చెడిపోకుండా, ఖమ్మంకు  తరలించేలా అదనపు వసతులు కల్పిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఎంహెచ్​ఓ కళావతి బాయి, ఆర్ అండ్ బీ ఎస్ఈ యుగంధర్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సన్న బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

దేశంలో పేదలకు సన్న బియ్యం అందజేస్తున్న  ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి తుమ్మల అన్నారు. శనివారం రఘునాథపాలెం మండలం బూడిదంపాడు గ్రామంలో లబ్ధిదారుడు గుడిబండ్ల రాజారావు ఇంటిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీపీ సునీల్ దత్, ఖమ్మం ఇన్​చార్జి కలెక్టర్ శ్రీజ లతో కలిసి ఆయన భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూలి చేసుకునే కుటుంబం నేడు సంతోషంతో సన్న బియ్యం భోజనం చేస్తోందని తెలిపారు.

గతంలో ప్రభుత్వాలు రేషన్ కార్డుల ద్వారా అందించే దొడ్డు బియ్యం బయట మార్కెట్ లో రూ.10కి అమ్ముకొని, కూలి చేసిన డబ్బులతో సన్న బియ్యం కొనుక్కోవాల్సి వచ్చేదని గుర్తు చేశారు. రైతులకు కూడా లాభం ఉండాలని  క్వింటాల్ సన్న ధాన్యంపై మద్దతు ధరతో పాటు, రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని తెలిపారు.

ఈ కారణంగా సన్న వడ్ల సాగు 80 శాతం పండిస్తున్నారని చెప్పారు. అంతకుముందు రఘునాథపాలెం మండలం బూడిదంపాడు -పుటాని తండా జడ్పీ రోడ్డు నుంచి వాంకుడో త్ తండా రోడ్డు వరకు రూ.2.50  కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణం, బూడిదంపాడు  ఎస్సీ కాలనీలో రూ.80 లక్షలతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణం, ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి బూడిదంపాడు గ్రామం వరకు రూ. 150 లక్షలతో నిర్మించనున్న అప్రోచ్ రోడ్డు నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.