
వెలుగు: రెవెన్యూ అధికారులకు లంచమిచ్చేందుకంటూ ఇటీవల వృద్ద దంపతులు భిక్షాటన చేసిన సంగతి మరవకముందే.. సోమవారం ములుగు జిల్లాలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారులు కోరిన లంచం ఇవ్వడానికి ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు సోమవారం తహసీల్దార్ ఆఫీసు ముందు బిచ్చమెత్తారు. ఈ వ్యవహారం సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ఇంఛార్జీ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ రైతులను కార్లలో భూముల వద్దకు తీసుకెళ్లి విచారణ జరిపారు. త్వరలోనే పట్టా పాస్ బుక్కులు అందిస్తామని హామీ ఇచ్చారు.
వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన బొమ్మడ సాంబయ్య, అనుముల దేవేందర్, పిల్లి సరోజన, బొంతల సమ్మక్క, రెడ్డి రామస్వామి తదితర రైతులకు 134 , 253సర్వే నెంబర్ లో భూములున్నాయి. ఈభూమికి పట్టాలివ్వాలని కొన్ని నెలల కింద రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్ దేవానాయక్ ను కూడా పలుమార్లు కలిసారు. పనికావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని అధికారులు చెప్పడంతో భిక్షాటనకు దిగారు. స్థానికులు కొందరు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తహసీల్దార్ ను వివరణ కోరారు.
కలెక్టర్ ఆదేశాలతో మండల రెవెన్యూ అధికారులు రైతులను తమ కార్లలో భూముల దగ్గరకు తీసుకెళ్లారు. సర్వేయర్, రెవెన్యూ అధికారులు సర్వేనిర్వహించారు. ఎవరెంత భూమి సాగు చేస్తున్నారు? రికార్డుల్లో ఎంత భూమి ఉంది? అన్న వివరాలు సేకరించారు. ఒక్కొక్కరికి ఎకరం నుంచి మూడెకరాల వరకు భూమి ఉండటంతో పట్టా చేయాలని వీఆర్వోకు సూచించారు. దీంతో రైతులు శాంతించారు.
పట్టాలివ్వాలి
134 , 253 సర్వేనెంబరులో నా కొడుకు, భార్య పేర్ల మీద కలిపి పదెకరాల భూమి ఉంది. పట్టా చేయాలని రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగాను. అయినా స్పందించలేదు. డబ్బులు ఇస్తేనే చేస్తామంటున్నారు. చేసేదేమీలేక భిక్షాటనకు దిగినం.
-బొమ్మడ సాంబయ్య రైతు, వెంకటాపురం
బిచ్చమెత్తుకుంటే కదిలిండ్రు
భూమికి పట్టాలు చేయించుకునేందుకుగాను భిక్షాటన చేసినం. రైతులం ఆరుగాలం కష్టపడితే పండించిన పంటకు ధర రావడంలేదు. డబ్బులు లేక భిక్షాటన చేయడంతో తహసీల్దార్ తమ భూముల వద్దకు వచ్చి సర్వేచేశారు.
– అనుముల దేవేందర్ , రైతు, వెంకటాపురం