
- రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి వెల్లడి
- ఇక్రిసాట్‌ను సందర్శించిన కమిషన్ సభ్యులు
హైదరాబాద్, వెలుగు: మారుతున్న వాతావరణ, వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా ఇక్రిసాట్ చేపడుతున్న పరిశోధనలు సంప్రదాయ పంటల అభివృద్ధికి దోహదపడుతున్నాయని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. కోదండ రెడ్డి నేతృత్వంలో కమిషన్ సభ్యులు శుక్రవారం అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఇక్రిసాట్) ను సందర్శించింది. ఈ సందర్భంగా ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ స్టాన్‌ఫర్డ్ బ్లేడ్, ప్రిన్సిపల్ సైంటిస్టులు డాక్టర్ హరికిషన్ సుడిని, డాక్టర్ జానిలాతో కోదండ రెడ్డి భేటీ అయ్యారు.
ఇక్రిసాట్ పరిశోధనలు, కార్యక్రమాలపై చర్చించారు. మెట్ట పంటల అభివృద్ధి, విత్తన పరిశోధన, మట్టి ఆరోగ్యం, నీటి సంరక్షణ, రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రాజెక్టులపై మాట్లాడారు. తమ పరిశోధనల ద్వారా రైతులకు అందిస్తున్న మద్దతు, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తున్న కార్యక్రమాలపై కమిషన్ బృందానికి ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు వివరించారు. రైతు కమిషన్ సభ్యులు తమ అభిప్రాయాలు, ప్రభుత్వ విధానాలను శాస్త్రవేత్తలకు తెలిపారు.1972లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఇక్రిసాట్‌ను ఏర్పాటు చేశారని, దీని కోసం 3,500 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించిందని కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రాంరెడ్డి, గోపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు హరి వెంకటప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.