జోగులాంబ గద్వాల జిల్లాలో పత్తి కొనుగోళ్లలో నిర్లక్ష్యం..ఆలస్యంగా ప్రారంభమైన సీసీఐ కొనుగోలు కేంద్రాలు

జోగులాంబ గద్వాల జిల్లాలో పత్తి కొనుగోళ్లలో నిర్లక్ష్యం..ఆలస్యంగా ప్రారంభమైన సీసీఐ కొనుగోలు కేంద్రాలు
  •     ప్రైవేట్​ వ్యాపారులకు అమ్ముకొని నష్టపోతున్న రైతులు
  •     గద్వాల జిల్లాలో మూడింటిలో రెండు సెంటర్లు మాత్రమే ఓపెన్
  •     ఇప్పటి వరకు సీసీఐ కొనుగోలు చేసింది 2,562 క్వింటాళ్లే

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిర్లక్ష్యం చేస్తోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో మూడు సెంటర్లు ఓపెన్  చేస్తామని చెప్పినప్పటికీ, రెండు సెంటర్లు మాత్రమే ఓపెన్  చేసి వర్షాలు పడుతున్నాయనే కారణంతో క్లోజ్  చేశారు. ఇప్పటివరకు అలంపూర్ లోని ఒక సెంటర్​లో మాత్రమే 2,562 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. గద్వాలలో రెండు సెంటర్లు ఓపెన్  చేస్తామని చెప్పిన అధికారులు, ఒక సెంటర్ ను​ఓపెన్  చేశారు. ఇందులో ఇప్పటి వరకు పత్తి కొనుగోళ్లు ప్రారంభించలేదు.

సగం పత్తి ప్రైవేట్​ వ్యాపారులకు అమ్మేసుకున్రు..

జోగులాంబ గద్వాల జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక ముందే రైతులు తాము పండించిన పత్తిని సగానికి పైగా కర్నాటక, ప్రైవేట్  వ్యాపారులకు అమ్మేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా రైతులకు పెద్దగా ఉపయోగం ఉండదని చెబుతున్నారు. 50 రోజుల నుంచే పత్తి దిగుబడి ప్రారంభం కావడంతో వెహికల్స్​లో కర్నాటకలోని రాయచూరు మార్కెట్ కు తరలించి అమ్ముకున్నారు.

 సీసీఐ కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో పత్తిని రూ.6 వేలకు క్వింటాల్​ చొప్పున  అమ్ముకోవాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతుల పేరుతో వ్యాపారులు తాము కొన్న పత్తిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటారనే విమర్శలున్నాయి.

రెండు సెంటర్లే ఓపెన్​ చేసిన్రు..

పత్తి కొనుగోలు చేసేందుకు గద్వాల నియోజకవర్గంలో రెండు, అలంపూర్  నియోజకవర్గంలో ఒక సీసీఐ  కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆఫీసర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం అలంపూర్ లో ఒక సెంటర్​ను, శనివారం గద్వాలలో ఒక సెంటర్ ను ఓపెన్  చేశారు. కానీ, అలంపూర్​లో మాత్రమే స్లాట్స్  బుక్​ చేసుకున్న రైతుల నుంచి రెండు రోజులు పత్తిని కొనుగోలు చేశారు. జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, సీసీఐ కొనుగోలు సెంటర్లకు 2.24 లక్షల మెట్రిక్  టన్నుల పత్తి వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది పత్తి దిగుబడి అంతంతే..

ఈ ఏడాది పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షాలతో దిగుబడి అంతంతమాత్రంగానే వచ్చింది. మరోవైపు సకాలంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మద్దతు ధర లభించక రైతుల రెండు విధాలుగా నష్టపోయారు. పత్తికి రూ.8,110 మద్దతు ధరను ప్రకటించింది. కానీ, పత్తిని నిల్వ చేసుకోలేక సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక ముందే చాలా మంది రైతులు తక్కువ ధరకే పంటను అమ్ముకొని నష్టపోయారు.

వర్షాల కారణంగానే కొనుగోళ్లు నిలిపేశారు..

వర్షాలతో సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు. శనివారం నుంచి మళ్లీ కొనుగోళ్లు ప్రారంభిస్తాం. అలంపూర్​లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గద్వాలలో మరో సెంటర్ ను ఓపెన్  చేస్తాం. సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభం కావడంతో కొంత ప్రైవేట్  మార్కెట్ కు వెళ్లిన మాట వాస్తవమే. యాప్  ద్వారా కొనుగోలు చేయడంతో వ్యాపారులు సీసీఐకి పత్తి అమ్ముకునే అవకాశం ఉండదు.-పుష్పమ్మ, మార్కెటింగ్  ఆఫీసర్, గద్వాల