భూసర్వేలో అవకతవకలంటూ అధికారులను నిలదీసిన రైతులు

భూసర్వేలో అవకతవకలంటూ అధికారులను నిలదీసిన రైతులు
  • భూసర్వేలో అవకతవకలంటూ అధికారులను నిలదీసిన రైతులు
  • చెక్కులు తీసుకునేందుకు నిరాకరణ
  • పుణ్యానికేం ఇస్తలేరన్న  అడిషనల్ కలెక్టర్ 
  • బతిమిలాడి అందజేసిన ఆఫీసర్లు

బోయినిపల్లి, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ –4  మిడ్ మానేరుకు అదనంగా1.1  టీఎంసీ నీటిని తరలించేందుకు నిర్మిస్తున్న వరద కాలువ భూ సర్వేలో అవకతవకలు జరిగాయని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని రత్నంపేట రైతులు అధికారులను నిలదీశారు. గ్రామంలో భూమి కోల్పోతున్న రైతులకు చెక్కులిచ్చేందుకు గురువారం అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్ తో పాటు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు వచ్చారు. దీంతో భూముల సర్వేలో అవకతవకలు జరిగాయని వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

తమ భూముల్లో బావులున్నప్పటికీ ఎందుకు చేర్చలేదని అడిగారు.  భూసర్వే సక్రమంగా చేసిన తర్వాతే చెక్కులు తీసుకుంటామని, అప్పటిదాకా తమ భూముల్లో పనులు చేయవద్దని కోరారు. దీంతో అడిషనల్​కలెక్టర్ ​ఖీమ్యానాయక్​ జోక్యం చేసుకుని ‘మీ  భూములు పుణ్యానికేం ఇస్తలేరు కదా’ అని అసహనం వ్యక్తం చేశారు. తేడాలున్నాయని చెబుతున్న వారి భూముల్లో మళ్లీ సర్వే చేస్తామని, బావులను పరిశీలించి పరిహారం అందేలా చూస్తామన్నారు. తమకు సహకరించి చెక్కులు తీసుకోవాలని కోరారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని బతిమిలాడటంతో కొందరు రైతులు మాత్రమే చెక్కులు తీసుకున్నారు.