తడిసిన ధాన్యం కొనాల్సిందే.. లేదంటే... రైతుల హెచ్చరిక

తడిసిన ధాన్యం కొనాల్సిందే..  లేదంటే... రైతుల హెచ్చరిక

అకాల వర్షాలు  రైతులను నట్టేట ముంచాయి. వడగండ్ల వాన చేతికొచ్చిన పంటను నీటిపాలు చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దిక్కు తోచని స్థితిలో ఉన్న తమకు ప్రభుత్వమే దిక్కని రైతులు వేడుకుంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 
 

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కామారెడ్డి జిల్లా లింగాయపల్లి, కోటాలపల్లి రహదారిపై రైతుల రాస్తారోకో నిర్వహించారు. ఎలాంటి నిబంధనలు లేకుండా దెబ్బతిన్న పంటలను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇచ్చేవరకు..ఆందోళన విరమించేది లేదని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. రైతుల ధర్నాతో రోడ్డుపై వాహనాలన్ని నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జాం అయింది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలోనూ రైతుల ధర్నా చేపట్టారు.

మరోవైపు కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు ధాన్యాన్ని రోడ్డుపై పోసి.. నిరసనకు దిగారు. ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో ఎన్ హెచ్ 44పై భారీ ట్రాఫిక్ జామ్ అయింది.