
- సూర్యాపేట జిల్లా రేపాల కెనరా బ్యాంక్ ఎదుట నిరసన
మునగాల, వెలుగు : అధికారులు చేసిన తప్పులతో తమకు రుణమాఫీ కాలేదని సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల కెనరా బ్యాంక్ ఎదుట వందమంది రైతులు పురుగుమందు డబ్బాలతో నిరసన తెలిపారు. బ్యాంకు పరిధిలో రేపాల నరసింహులగూడెం, జగన్నాథపురం, సీతానగరం, విజయరామపురం గ్రామాలకు చెందిన 1500 మంది రైతులుండగా, 300 మందికే రుణమాఫీ అయ్యింది. అధికారులు ఉన్నతాధికారులకు డేటాను పంపించకపోవడంతో మాఫీ కాలేదని రైతులు వాపోయారు. తమకు న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కామారెడ్డి జిల్లా లింగంపేటలో...లింగంపేట : కామారెడ్డి జిల్లా లింగంపేట
మండలంలోని పలు గ్రామాలకు చెందిన 73 మంది రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సింగిల్విండో) సీఈఓ నిర్లక్ష్యం కారణంగా రుణమాఫీ కాలేదని ఆవేదన చెందుతున్నారు. సీఈవో సందీప్ పై చర్యలు తీసుకోవాలనీ సోమవారం ఏవోకు ఫిర్యాదు చేశారు. రైతులు పొందిన రుణాలను విండో సీఈఓ ఆన్లైన్లో సకాలంలో నమోదు చేయకపోవడంతో తమకు రుణమాఫీ కాలేదన్నారు.
ఈ విషయమై చైర్మన్దేవేందర్రెడ్డిని ప్రశ్నించారు. ఆయన కూడా సీఈఓ వల్లే ఇలా తప్పు జరిగిందని చెప్పడంతో ఏవోకు కంప్లయింట్ చేశారు. న్యాయం జరగకపోతే ఆందోళనకు దిగుతామన్నారు. ఈ విషయమై విండో సీఈఓ సందీప్ మాట్లాడుతూ సాంకేతిక సమస్యల వల్ల ఆన్లైన్లో ఆలస్యంగా నమోదు చేయడం వల్ల సమస్య తలెత్తిందన్నారు. సమస్య పరిష్కారానికి కో ఆపరేటివ్ రాష్ట్ర కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఇదే సమస్య జిల్లాలోని 39 సింగిల్విండోల్లో ఉందన్నారు.