
- ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టుతో జలకళ సంతరించుకున్న చెరువులు, కుంటలు
- నార్కట్ పల్లి మండలంలో తీరనున్న సాగు, తాగునీటి కష్టాలు
నల్గొండ/నార్కట్ పల్లి, వెలుగు: కొన్నేళ్లుగా సాగు, తాగు నీటి కోసం ఎదురుచూస్తున్న నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల రైతుల కల నెరవేరింది. బ్రహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు నీటితో చెరువులు, కుంటలు నింపడంతో జలకళ సంతరించుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ప్రాంతంలో వర్షాధారంగా పంటలు సాగు చేసేవారు.
అయితే ఎండుతున్న పంటలకు కృష్ణా జలాలను అందించాలన్న లక్ష్యంతో 2007 సంవత్సరంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో అప్పటి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ.700 కోట్ల వ్యయంతో బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లోని చెరువులను నింపి సాగు, తాగు నీరు లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. కానీ 10 ఏళ్ల పాటు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బ్రహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టులో మళ్లీ కదలిక మొదలైంది. మోటార్లను ఆన్ చేసి రిజర్వాయర్ నింపడంతో అక్కడి నుంచి రైట్, లెఫ్ట్ కెనాల్స్ ద్వారా చెరువులను నింపుతున్నారు. దీంతో కొన్నేళ్లుగా ఎండిపోయిన నార్కట్ పల్లి మండలంలోని చెరువులు, కుంటలు నీటితో నిండాయి.
నిండుగా చెరువులు
గతేడాది డిసెంబర్ నెలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టును ప్రారంభించగా.. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురవడంతో బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టును పూర్తిగా నింపి కాలువల ద్వారా చెరువుల్లోకి నీటిని వదిలారు. దీంతో నకిరేకల్ నియోజకవర్గంలోని నార్కట్ పల్లి పెద్ద చెరువు కృష్ణా జలాలతో నిండింది.
ఈ చెరువు మత్తడి దూకించి మండలంలోని మాధవ ఎడవల్లి, ఏపీ లింగోటం, కట్టంగూరు మండలంలోని గద్దగూటి చెరువులను నింపనున్నారు. నల్గొండ, మునుగోడు నియోజకవర్గంలోని చెరువులకు నీటిని తరలిస్తున్నారు. ప్రస్తుత నీటి తరలింపు ద్వారా 50 వేల ఎకరాల వరకు సాగులోకి వచ్చింది. మరోపక్క కాలువల ద్వారా సాగునీటిని అందించేందుకు చర్యలు చేపట్టారు.
కుడికాలువ ద్వారా 57 వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 43 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా కుడి కాలువ 26.5 కిలోమీటర్లు, ఎడమ కాలువ 6.5 కిలోమీటర్ల మేర పొడువు తవ్వకం చేపట్టాల్సి ఉండగా భూసేకరణ చేస్తున్నారు. కాల్వల తవ్వకానికి కొంత మంది రైతులు అడ్డంకులు తెలపడంతో భూసేకరణ ఇబ్బందిగా మారింది. కాల్వల నిర్మాణం పూర్తయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది.
మినీ రిజర్వాయర్‌కు ప్రపోజల్స్
గోపాలపల్లి గుట్ట నుంచి నీటిని విడుదల చేసి నార్కట్ పల్లి పెద్ద చెరువును నింపి మినీ రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. 450 ఎకరాల్లో ఉన్న ఈ చెరువుని రూ. 35 కోట్ల అంచనా వ్యయంతో మినీ రిజర్వాయర్‌గా మార్చనున్నారు. చెరువు సుందరీకరణ, కట్ట బలోపేతం, వ్యూ పాయింట్స్, లైటింగ్, బోటింగ్స్, చెరువు మధ్యలో కృష్ణుడి ఆలయం పనులు చేపట్టేందుకు అధికారులు ప్రపోజల్స్ సిద్ధం చేశారు. ఈ చెరువును శ్రీవారి జాల వేణుగోపాల స్వామి చెరువుగా నామకరణం చేసి త్వరలోనే డెవలప్‌మెంట్ పనులను ప్రారంభించనున్నారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది
గత ప్రభుత్వం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి భూములు బీడుగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ప్రాజెక్టును పూర్తి చేయడంతో చెరువులు నిండి రైతులు సంతోషంగా ఉన్నారు. - వేముల వీరేశం, ఎమ్మెల్యే, నకిరేకల్
ఎడారి ప్రాంతం సస్యశ్యామలం
వర్షాలే ఇక్కడి రైతుల జీవనాధారం. వర్షాలు సరిగా పడక ఎడారి ప్రాంతంగా మారింది. అలాంటి ఈ ప్రాంతాన్ని బ్రాహ్మణవెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు ద్వారా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సస్యశ్యామలం చేశారు. రాబోయే కొద్ది రోజుల్లోనే కాలువల పూర్తి ద్వారా మరిన్ని ఎకరాలకు సాగునీరు అందనుంది.
– బత్తుల ఉషయ్య గౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు