తాలు పేరుతో తూకంలో మోసం .. చేతివాటం చూపిస్తున్నానిర్వాహకులు

తాలు పేరుతో తూకంలో మోసం .. చేతివాటం చూపిస్తున్నానిర్వాహకులు

నిజాంపేట, వెలుగు: మండల పరిధిలోని బచ్చురాజ్ పల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ లో నిర్వాహకులు చేతివాటం చూపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో ధాన్యం బస్తాలో 40 కిలోల ధాన్యాన్ని తూకం వేసి రైస్ మిల్లులకు పంపించాలి. కానీ ధాన్యంలో తాలు పేరుతో 42.300 కిలోలు కాంటా వేస్తున్నారు. ఆదివారం లింగం, రాజు అనే ఇద్దరు రైతుల ధాన్యం తూకం వేసేటప్పుడు ఎక్కువ ధాన్యం కాంటా పెడుతున్నట్లు అనుమానం రాగా ఆ సంచులను మళ్లీ కాంటా పెట్టగా ఒక్కో సంచి 43 కిలోల 900 గ్రాములు వచ్చాయి. 

ఇంత ఎక్కువ తూకం ఎందుకు వేస్తున్నారని రైతులు ప్రశ్నించగా, సెంటర్ నిర్వాహకులే ఎక్కువ తూకం వేయమని చెబితే అలా చేశామని హమాలీలు బదులిస్తున్నారని  రైతులు తెలిపారు. మరోవైపు రైతులు లొల్లి చేస్తే లారీలు ఈ సెంటర్ కు రావని లారీల ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ బెదిరిస్తున్నాడని ఆ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో కలెక్టర్ స్పందించి ఎన్ని రోజుల నుంచి ఇలా ఫ్రాడ్ చేస్తున్నారో ఎంక్వయిరీ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

సెంటర్ నిర్వాహకురాలి తొలగింపు

ధాన్యం తూకం విషయంలో తేడాలు వస్తే సహించేది లేదని సివిల్​సప్లై డీఎం జగదీశ్ అన్నారు. సోమవారం ఆయన బచ్చురాజ్ పల్లి గ్రామంలో ఎక్కువ వడ్లు తూకం వేసిన ఐకేపీ సెంటర్ ను పరిశీలించి గ్రామస్తులు, రైతులతో మాట్లాడారు. సెంటర్ నిర్వాహకురాలు మంజులను తొలగిస్తున్నామని తెలిపారు. సెంటర్ లో ఇంకా ఏదైనా ఫ్రాడ్ జరిగిందా అనే విషయంపై ఎంక్వయిరీ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయన వెంట డీపీఎం మోహన్, తహసీల్దార్​ శ్రీనివాస్ ఉన్నారు.