రుణమాఫీ అవ్వక.. రైతులు ఆగమైతున్నరు

V6 Velugu Posted on Jul 21, 2021

ఎన్నికల సమయంలో అధికారం చేపట్టడానికి హామీలు ఇచ్చినా అవి ఆచరణాత్మకంగా ఉండాలి. ఆ తర్వాత వాటిని కచ్చితంగా నెరవేర్చాలి. కానీ మన రాష్ట్రంలో టీఆర్ఎస్​ ప్రభుత్వ విధానాలు అస్తవ్యస్థంగా ఉన్నాయి. అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలు అన్నీ గందరగోళంగా మారాయి. ఇచ్చిన హామీలకు, తీసుకుంటున్న నిర్ణయాలకు ఎక్కడా పొంతన లేదు. హామీల అమలుకు వేల కోట్లలో బడ్జెట్ అలాట్ చేస్తున్నా.. నిధులు మాత్రం రిలీజ్​ చేయడం లేదు. రైతు రుణాల మాఫీ అంశాన్నే తీసుకుంటే మూడేండ్లలో బ్యాంకులకు చెల్లించిన మొత్తం రూ.408 కోట్లే. 40.66 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా 2.96 లక్షల మందికి మాత్రమే మాఫీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ప్రభుత్వం రుణాలు చెల్లిస్తుంది కదా అని రైతులు ఏండ్లుగా ఎదురుచూస్తూ ఉండటంతో వడ్డీ పెరిగిపోతోంది. సకాలంలో ప్రభుత్వం రుణాలు మాఫీ చేయకపోవడంతో మిగతా రైతులు బ్యాంకుల దృష్టిలో మొండి బకాయిలు(ఎన్​పీఏలు)గా మారుతున్నారు. దీంతో మళ్లీ రుణాలు తీసుకునేందుకు అర్హత వారంతా అర్హత కోల్పోతున్నారు.

2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్​ పార్టీ పంట రుణాలు మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఎలక్షన్స్ సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం 2014 మార్చి 31 వరకు రైతులకు రూ.లక్ష వరకు ఉన్న రుణాన్ని మొత్తం మాఫీ చేసింది. నాలుగు విడతలుగా 35,29,944 మంది రైతులకు రూ.26,243.37 కోట్లను ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించి రైతులను రుణ విముక్తులను చేసింది. అప్పుడు రైతుల ఆనందం చెప్పలేనిది. అయితే రైతులు మళ్లీ వ్యవసాయం చేయాలి. అంటే మళ్లీ బ్యాంకుకు వెళ్లి అవసరం రీత్యా రుణం పొంది పనులు చేయాలి. చాలా మంది రైతులు అదే చేశారు. మళ్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. ఏ రైతూ ప్రభుత్వాన్నిగానీ, ఏ పార్టీనిగానీ మళ్లీ రుణ మాఫీ చేయాలని అడగలేదు. కానీ సీఎం కేసీఆర్.. మళ్లీ అధికారంలోకి రావడం కోసం 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రచారంలో ‘‘టీఆర్ఎస్ పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. నేనే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో రైతులను రాజులను చేస్తాను. 2014 ఏప్రిల్ నుంచి 2018 డిసెంబర్ 11 వరకు తీసుకున్న రూ.లక్ష వరకు బ్యాంకు రుణాలను మునుపటిలాగే నాలుగు విడతలుగా తీరుస్తా” అని ప్రకటించారు. అయితే ఏడాదికోసారి ఒక్కో విడతగా బ్యాంకు అప్పును ప్రభుత్వమే చెల్లిస్తుందని మెలిక పెట్టారు. అది తెలియని అమాయక రైతులు మళ్లీ మన బ్యాంకు రుణం తీరుతుందని సంబురంగా టీఆర్ఎస్​కు ఓటు వేసి కేసీఆర్​ను మళ్లీ ముఖ్యమంత్రిని చేశారు.

బడ్జెట్​ అలాట్​ చేసినా.. రిలీజ్​ చేయలె
కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్​ సర్కారు రైతులను పూర్తిగా మరిచిపోయింది. రుణ మాఫీ సంగతి మొత్తంగా పక్కన పెట్టేసింది. ఎన్నోసార్లు రైతులు రుణమాఫీ కోసం మొత్తుకున్నారు. ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు రావడంతో చివరికి ప్రభుత్వం బడ్జెట్​లో రుణమాఫీ కోసం నిధులు కేటాయించింది. అవి చూద్దాం. 2019-–20 బడ్జెట్ లో రూ.6,000 కోట్లు, 2020-–21 బడ్జెట్ లో రూ.6,225 కోట్లు, 2021-–22 బడ్జెట్ లో రూ.5,225 కోట్లు మొత్తం కలిపి రూ.17,450 కోట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.లక్ష వరకు రుణం తీసుకున్న 40.66 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కానీ, టీఆర్ఎస్​ పార్టీ రెండోసారి అధికారం చేపట్టి మూడేండ్లు కావచ్చినా.. రైతుల గోసను పట్టించుకోలేదు. మూడేండ్లు బడ్జెట్​లో నిధులు అలాట్​ చేసినా రూపాయి కూడా బ్యాంకులకు చెల్లించ లేదు. మూడేండ్లలో బడ్జెట్ లో రూ.17,450 కోట్లను చూపించినా.. గతేడాది జూన్ లో మాత్రమే రుణమాఫీ పథకం కోసం తొలి విడతగా రూ.25 వేల లోపు రుణాలను చెల్లించేందుకు రూ.1,210 కోట్లను విడుదల చేశారు.

చెల్లించింది రూ.408 కోట్లు మాత్రమే
వ్యవసాయ శాఖ అధికారులు రైతు నుంచి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, కుటుంబ సర్వే వివరాల లెక్కలు తీయగా.. 2.96 లక్షల మంది రైతులకు రూ.25 వేల లోపు రుణం ఉన్నట్టు గుర్తించినారు. వారి బ్యాంకు అకౌంట్ల వివరాలు సేకరించి రూ.408 కోట్లను జమ చేశారు. అంటే 40.66 లక్షల మంది రైతులకు గానూ రుణమాఫీ అయ్యింది 2.96 లక్షల మందికే. మిగతా 37.70 లక్షల మంది రైతులు ఎప్పుడు తమకు రుణమాఫీ అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు. రూ.1,210 కోట్ల నుంచి రూ.408 కోట్లు పోతే మిగిలిన రూ.802 కోట్లను రెండో విడత రుణమాఫీకి వాడొచ్చని వ్యవసాయ అధికారులు ప్రభుత్వ ఉత్తర్వుల కోసం చూశారు. కానీ మిగులు నిధులు తిరిగి రాష్ట్ర ఆర్థిక శాఖకు పంపించాలని సీఎం ఆఫీస్ నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు ఆ నిధులను ఆర్థిక శాఖకు పంపేశారు. కథ మళ్లీ మొదటికొచ్చింది.

రైతుబంధు, ధాన్యం పైసలు జమ
ప్రభుత్వం రుణమాఫీ చేసినప్పుడే మిగతా బకాయిలు చెల్లిద్దామని చాలా మంది రైతులు ఎదురుచూస్తున్నారు. కాని ప్రభుత్వం ఇప్పటి వరకు రుణమాఫీ డబ్బులు రిలీజ్​ చేయకపోవడంతో వారికి బాధలు తప్పటంలేదు. రుణాలు చెల్లించని రైతుల అకౌంట్లను ఎన్​పీఏల జాబితాలో చేర్చడంతో మళ్లీ బ్యాంకులో అప్పు తీసుకునే అర్హతను చాలా మంది రైతులు కోల్పోతున్నారు. దీంతో ఎక్కువ వడ్డీలకు ప్రైవేటు వ్యాపారులు, సంస్థల నుంచి అప్పులు తీసుకోవాల్సి వస్తోంది. ఈ మధ్య ప్రభుత్వం 61.49 లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం కింద యాసంగి పంటలకు రూ.7,515 కోట్లు, వానాకాలం పంటకు మరో రూ.7,515 కోట్లు విడుదల చేసింది. అయితే ఇందులో బ్యాంకు లోన్లు తీర్చని 37.70 లక్షల రైతుల ఖాతాల్లో జమ చేసిన దాదాపు రూ.10 వేల కోట్లను రుణాలు, వడ్డీల కింద బ్యాంకులు జమ చేసుకున్నాయి. ప్రభుత్వం చూపిన ఆశకు రైతులు ఆత్మాభిమానం దెబ్బతిని, బ్యాంకులో పరువుపోయి, తిరిగి పంట రుణం పొందే అర్హత లేక ఈ 37.70 లక్షల మంది రైతులు ఆగమవుతున్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్  ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే పథకాలు, ఆచరణలో సాధ్యం కాని హామీలు, బడ్జెట్లలో నిధులు చూపుడు మానుకుని, ప్రజల అవసరాలు గుర్తించి వారికిచ్చిన హామీలు అమలు చేయాలి. రైతుల పక్షపాతి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవడం కాకుండా 37.70 లక్షల మంది రైతుల బాధలు తీర్చి వారిని రుణ విముక్తులను చేయాలి. ఇప్పటికైనా ఈ దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుతుందని ఆశిద్దాం.

37.70 లక్షల మంది రైతుల ఎదురుచూపులు
37.70 లక్షల మంది రైతులు తమ బ్యాంకు రుణం ఎప్పుడు మాఫీ అవుతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. రుణమాఫీ సొమ్ము ప్రభుత్వం నుంచి రాక రైతులకు వచ్చిన రైతుబంధు పైసలు, ధాన్యం అమ్మిన సొమ్మును బ్యాంకులు అప్పులు, వడ్డీకి జమ చేసుకుంటున్నాయి. మూడేండ్ల నుంచి రైతుల పంట రుణాలు అలానే ఉన్నాయి. దీంతో బ్యాంకు అధికారులు అప్పులు చెల్లించని, కనీసం లోన్లను రెన్యువల్ చేయని రైతుల అకౌంట్లను మొండి బకాయిలు(ఎన్​పీఏ) జాబితాలోకి చేరుస్తున్నాయి. ప్రభుత్వం అనుసరించిన విధానం వల్లే ఇలా జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. మొదట నేరుగా రైతు ఖాతాల్లో పైసలు జమ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్​ ప్రభుత్వం ఆ తర్వాత మాట మార్చింది. అసలు, వడ్డీ కలిపి రూ.లక్ష వరకు ఉన్న రుణం మాఫీ చేస్తామని, రైతులకు చెక్కులు ఇస్తామని ఒకసారి, నేరుగా ఆన్​లైన్​ పద్ధతిలో బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని మరోసారి చెప్పి రైతులను మోసగించింది. 

- శ్రీనివాస్ తిపిరిశెట్టి, సీనియర్ జర్నలిస్ట్

Tagged TRS, Telangana, agriculture, runamafi, rythubandhu, Farmer\\\\\\\'s, tipirishetty srinivas

Latest Videos

Subscribe Now

More News