మేం గోస పడ్తుంటే..సంబురాలా? ... లీడర్లు, అధికారులపై మర్లవడ్డ రైతులు

మేం గోస పడ్తుంటే..సంబురాలా? ... లీడర్లు, అధికారులపై మర్లవడ్డ రైతులు

 

  • చాలా చోట్ల రైతు దినోత్సవం బహిష్కరణ 
  • వడ్ల కొనుగోళ్లు, నష్ట పరిహారం, రుణమాఫీపై నిలదీతలు
  • తరుగు పేరిట నిండా ముంచుతున్నారని ఆవేదన
  • సీఎం ప్రకటించి రెండు నెలలైతున్నా పరిహారం రాలేదని ఫైర్​
  • ధరణితో తిప్పలు పడ్తున్నా పట్టించుకోవడం లేదని కన్నీళ్లు
  • మెదక్​ జిల్లా గోమారంలో ప్రశ్నించిన మహిళను
  • ఈడ్చుకెళ్లి జీపులో ఎక్కించిన పోలీసులు

నెట్​వర్క్, వెలుగు: రాష్ట్ర సర్కారు తీరుపై రైతులు భగ్గుమన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన ‘రైతు దినోత్సవం’ వేదికల వద్దే  బీఆర్​ఎస్​ లీడర్లను, అధికారులను నిలదీశారు. కష్టనష్టాలకు ఓర్చి పంటలు పండిస్తే.. వాటిని టైమ్​కు కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  పంటలకు నష్ట పరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్​ చెప్పి రెండు నెలలు దాటిపోతున్నా ఇప్పటికీ ఒక్క పైసా రాలేదని  మండిపడ్డారు. నాలుగేండ్లవుతున్నా రూ. లక్ష రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తాలు, తరుగు పేరుతో మిల్లర్లు దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ‘‘రైతుబంధు ఇస్తున్నాం కదా.. ఇంకెందుకు?” అని కొందరు లీడర్లు చెప్పేందుకు ప్రయత్నించగా మండిపడ్డారు. రైతుబంధు పైసలు లోన్ల వడ్డీలకు కూడా సరిపోవడం లేదన్నారు. ‘‘కొనుగోలు సెంటర్లలో కాంటాలు కాక.. తరుగు పేరిట మిల్లర్ల వేధింపులతో మేము గోస పడుతుంటే మీరు సంబురాలు జరుపుకుంటారా?’’ అంటూ ఫైర్​ అయ్యారు.  రైతులకు సమాధానాలు చెప్పలేక కొందరు లీడర్లు.. సంబురాలను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు.  

ధరణితో భూములు గుంజుకుంటున్నరు

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శని వారం రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు దినోత్సవం’ చేపట్టింది. రైతు వేదికల వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తో సభలు ఏర్పాటు చేసింది. వీటిని చాలా చోట్ల రైతులు బహిష్కరించారు. తమ భూముల సమస్యతీరేదాక సంబురాలు వద్దంటూ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్  రైతులు ఆందోళనకు దిగారు. వంటలు చేసేందుకు ఏర్పా టు చేసిన  పొయ్యిలను ఆర్పేసి, కూరగాయలను పారబోశారు.  284 సర్వే నెంబర్​లో మూడుతరాల నుంచి  60 మంది రైతులం సాగు చేసుకుంటున్నామని, ధరణి పోర్టల్ వచ్చాక కొందరు రియల్​ఎస్టేట్​ వ్యాపారులు, అధికార పార్టీ లీడర్లు కలిసి తమ భూములు వారి పేర్ల  మీదికి మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రెవెన్యూ ఆఫీసర్లకు  ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా  పట్టించుకోలేదని, తమనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్ల విషయంలో మహ్మద్​నగర్  గ్రామ మహిళలు మండిపడ్డారు. 

రైతులు ఎక్కడ సంతోషంగా ఉన్నరు?
    
పంట దెబ్బతిన్న  రైతులకు రూ.10 వేలు నష్టపరిహారం ఇవ్వకుండా  ఉత్సవాలు ఏందని సిద్దిపేట జిల్లా కొమురవెల్లికి చెందిన రైతు శ్రీనివాస్ అధికారులను, ప్రజా ప్రతినిధులను నిలదీశారు. వడగండ్లవానతో పంట నష్టపోయి దుఖంలో ఉంటే  రైతులంతా  సంతోషంగా ఉన్నట్లు అధికారులు,  ప్రజాప్రతినిధులు చెప్తున్నారని మండిపడ్డారు. దీంతో  మైకు తీసుకొని ఆయన్ను బయటకు పం పే ప్రయత్నం చేయగా వాగ్వాదం జరిగింది. ‘‘వడ్లు అమ్ముకుందామంటే తరుగు పేరిట క్వింటాలుకు 8 కిలోలు పైగా కోతలు పెడుతున్నరు.మొదట్లో  తరుగు 2కిలోలు  అన్నరు.. తర్వాత 3 అన్నరు...ఇప్పుడేమో 8 కిలోలు తీస్తున్నరు. ఇదేం దోపిడీ. రైతులు ఏం గావాలె?” అంటూ జగిత్యాల జిల్లా  మెట్​పల్లి మండలం జగ్గసాగర్  సభలో  అధికార పార్టీ లీడర్లు, ఆఫీసర్లను రైతు పాలెపు శేఖర్ నిలదీశారు. 
    
నిర్మల్​ జిల్లా సారంగాపూర్​లో రైతు వేదికను రైతులు అడ్డుకున్నారు. తమ వడ్లను కొనుగోలు చేయకుండా సంబురాలు ఎట్లా  జరుపుకుంటారని ప్రశ్నించారు. ఎంపీటీసీ సామల పద్మ  నేలపై కూర్చొని నిరసన తెలిపారు.  రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ లో రైతులు రైతు వేదికకు తాళం వేశారు. కొనుగోళ్లలో జాప్యంతో నష్టపోతున్నామని రైతు పసులు వెంకట్ గోడు వెళ్లబోసుకున్నారు. అందుకే రైతు వేదికకు తాళం వేశామని రైతు గన్నేరు నర్సయ్య తెలిపారు.  కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా దహెగాం మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన ఉత్సవాల్లో  వండిన చికెన్​ కూర, అన్నం బాగా మిగిలిపో యాయి.  ‘‘1,200 మంది రైతులువస్తారని ఏఈ వో చెప్పడంతో 1,200 మంది రైతుల కోసం వం టలు సిద్ధం చేయించినం. కానీ అనుకున్నంత మంది రాకపోవడంతో మిగిలిపోయాయి” అని ప్రోగ్రామ్​ ఇన్​చార్జ్​ రాజేశ్వర్​ గౌడ్​  అన్నారు 
    
కొనుగోలు సెంటర్లలో వడ్లు తరలించడానికి లేని ఉత్సాహం, ఉత్సవాలు నిర్వహించడానికి ఎందుకని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మం డలం మూలమర్రి తండా జీపీ పరిధిలోని రైతు వేదిక సభలో రైతులు ప్రశ్నించారు. హాకా చైర్మన్  మచ్చ శ్రీనివాసరావు తమ గ్రామ వ్యవహారాల్లో  తలదూర్చి ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఉత్సవాల నుంచి ఆయన వెళ్లిపోవాలని నినాదాలు చేశారు.  దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లిలోని రైతు వేదికలో రైతు దినోత్సవం చేపట్టారు.  కొద్ది సేపటికే డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్​కుమార్​ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, కాంగ్రెస్​ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. వడ్లు కొనకుండా ఇబ్బంది పెడుతూ  రైతు దినోత్సవాలు నిర్వహించడం ఏమిటని వా రు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొల్లేపల్లిలో ఎక్కడి వడ్ల కుప్పలు అక్కడే ఉన్నాయని అన్నారు.  ఆయి ల్ ఫెడ్​ చైర్మన్​ కంచర్ల రామకృష్ణారెడ్డి, రైతు నమన్వయ సమితి జిల్లా కన్వీనర్​ కొలుపుల అమరేందర్​ సమాధానం చెప్పబోయారు. దీంతో గందరగోళం నెలకొంది.

మహిళా రైతును ఈడ్చుకెళ్లిన్రు

మెదక్ (శివ్వంపేట), వెలుగు:  భూమి విషయంలో తనకు అన్యాయం జరిగిందని సభలో నిరసన తెలి పిన మహిళను పోలీసులు ఈడ్చుకెళ్లి జీపులో ఎక్కించారు. ఈ సంఘటన శనివారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలో జరిగింది. శనివారం రైతు వేదిక ఓపెనింగ్ ప్రోగ్రామ్​కు అగ్రికల్చర్ కమిషనర్ రఘునందన్ రావు, కలెక్టర్ రాజర్షి షా వచ్చారు. ఈ మీటింగ్​కు పిట్టలవాడకు చెందిన పది మంది రైతులు రాగా.. డిస్ట్రిక్ట్​ అగ్రికల్చర్​ ఆఫీసర్​ మాట్లాడుతుండగా వారిలో సునీత అనే రైతు లేచి తమ తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు గుంజుకుంటున్నారని, వారికి రూలింగ్​ పార్టీ లీడర్లు సపోర్ట్​ చేస్తున్నారని అన్నారు. పోలీసులతో తహసీల్దార్​ తమను కొట్టిచ్చారని సునీత తెలిపారు. పోలీసులు ఆమెను స్టేజీ ముందు నుంచి ఈడ్చుకెళ్లి పోలీస్​ జీపులో ఎక్కించి కొద్ది దూరంలో వదిలిపెట్టారు.

రైతులను పట్టించుకోకుండా సభలా? : బీఆర్​ఎస్​ ఉప సర్పంచ్​

మెదక్ (రేగోడ్), వెలుగు: రైతుల సమస్యలు పట్టించు కోకుండా రైతు సభలు నిర్వహించడం ఏందని అధికారులపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన రేగోడ్ ఉప సర్పంచ్ రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రేగోడ్ మండల కేంద్రంలో నిర్వహించిన రైతు సభలో ఆయన మాట్లాడుతూ.. రైతులు నెల రోజులుగా కొనుగోలు కేంద్రంలో వడ్ల కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నా ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదని,  కానీ రైతు సభలు ఎలా నిర్వహిస్తారని స్టేజీ మీద నిలదీశారు. నెల రోజుల్లో కేవలం రెండు లారీలలోనే రేగోడు కొనుగోలు కేంద్రం నుంచి వడ్లను తరలించారని, ఇంకా పది లారీల వరకు వడ్లు తరలించాల్సి ఉన్నాయన్నారు.  

రైతు వేదికకు సర్పంచ్ ​తాళం 

నవీపేట్, వెలుగు:  చేసిన పనులకు బిల్లు రాక తా ము అప్పులపాలైతే ఈ సంబురాలు ఏందని రైతు వేదికకు సర్పంచ్ తాళం వేశారు. నిజామా బాద్​ జిల్లా నవీపేట్​ మండలంలోని నాల్లేశ్వర్ రైతు వేదిక వద్ద శనివారం రైతు సంబురాలు చేపట్టగా.. సర్పంచ్ సరిన్ వచ్చి ‘‘రైతు వేదిక నిర్మించి మూడేండ్లు పూర్తయింది.  రూ. 22 లక్షలకు ఇప్పటివరకు రూ. 18.20 లక్షలే వచ్చాయి.  మిగతా మూడు లక్షలు రాలేదు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాళం వేశారు.

కొప్పుల క్యాంప్​ ఆఫీసు ముందు వడ్లు పోసి రైతు నిరసన

ధర్మపురి, వెలుగు: వడ్లు కొంటలేరని, రైస్​ మిల్లర్లు కుమ్మక్కై రైతులను అరిగోస పెడ్తున్నారని ఓ రైతు.. శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంప్ ఆఫీస్ ఎదుట వడ్ల ను పోసి నిరసన తెలిపారు. ధర్మపురిలోని క్యాంపు ఆఫీస్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉం డగానే.. మండలంలోని కమలాపూర్ గ్రామా నికి చెందిన చట్టంశెట్టి రాజన్న అనే రైతు తాను పండించిన వడ్లను ట్రాక్టర్​లో అక్కడికి తీసుకొచ్చి కుప్పగా పోశారు. కొన్నిరోజుల కింద మంత్రి కొప్పుల ఈశ్వర్ వచ్చి తరుగు లేకుండా వడ్లు  కొంటామని హామీ ఇచ్చారని, కానీ కొనుగోలు కేంద్ర నిర్వాహకులు అవేమీ పట్టించుకోవడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి రెండుసార్లు చెడగొట్టు వానలు పడి వడ్లు తడిసిపోయాయని, వడ్లను కొనుగోలు సెంటర్​కు తీసుకొని పోయి 40 రోజులు గడుస్తున్నా కొనడం లేదని వాపో యారు.  రైతుల ఆవేదన మంత్రికి తెలియజేసేందుకే ఇట్ల నిరసన చేపట్టానని అన్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని వడ్లను తొలగించి, ట్రాకర్ తో పాటు రైతు రాజన్నను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సిగ్గు, శరం లేదా నీకు!
పరిహారం గురించి ప్రశ్నించిన రైతుపై  కౌశిక్​రెడ్డి ఆగ్రహం

జమ్మికుంట, వెలుగు: నష్టపోయిన పంటలకు పరిహారం ఇంకా ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించిన ఓ రైతు మీద బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ పాడి కౌశిక్​రెడ్డి చిందులేశారు. ‘‘రైతుబంధు, పింఛన్​ తీసుకుంటూ ఇట్ల అడగడానికి సిగ్గు, శరం లేదా?” అంటూ దుర్భాషలాడారు. శనివారం కరీంనగర్​ జిల్లా ఆబాది జమ్మికుంట రైతు వేదిక వద్ద జరిగిన సభలో  కౌశిక్ రెడ్డి మాట్లాడుతుండగా.. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడం లేదంటూ రైతు బుర్ర కుమార్ నిలదీశారు. అకాల వర్షాలతో నష్ట పోయిన రైతులకు పదిరోజుల్లో పరిహారం ఇస్తామని చెప్పి, మూడు నెలలైనా ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. రుణ మాఫీ హామీ ఏమైందని అడిగారు. దీంతో ఒక్కసారిగా  కౌశిక్​రెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ... ‘‘నీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది. రైతుబంధు తీసుకుంటలేవా, పింఛన్ తీసుకోవడం లేదా..! నీ అసుంటోళ్లను మస్తు మందిని చూసినం. నీకు సిగ్గనిపిస్తలేదా? సిగ్గు లేదా.. సిగ్గు శరం లేదా నీకు’’ అంటూ విరుచుకుపడ్డారు.