భూముల సమస్యలపై ధరణికి మస్తు ఫిర్యాదులు

భూముల సమస్యలపై  ధరణికి మస్తు ఫిర్యాదులు

గ్రీవెన్స్‌ వాట్సాప్‌ నంబర్‌కు మూడ్రోజుల్లోనే 17 వేలు
ఈ మెయిల్‌కు మరో 3 వేలు
భూముల సమస్యలపై లక్ష దాటిన కంప్లైంట్లు
ట్విట్టర్‌లోనూ కేటీఆర్‌కు గోడు 
పార్ట్ బీ, ప్రొహిబిటెడ్ ల్యాండ్ సమస్యలే ఎక్కువ 

హైదరాబాద్, వెలుగు: ఊర్లల్లోని భూ సమస్యలపై ధరణి వెబ్‌సైట్‌కు విపరీతంగా ఫిర్యాదులు వస్తున్నాయి. భూములకు సంబంధించిన రకరకాల సమస్యలపై ఇప్పటికే లక్షన్నరకు పైగా కంప్లైంట్స్‌ వచ్చాయి. పార్ట్ బీలో చేర్చడం వల్ల భూములకు పాస్‌ బుక్స్ రానోళ్లు, పాస్ బుక్ వచ్చినా ధరణిలో డిజిటల్ సైన్ కానోళ్లు, కొత్త పాస్ బుక్ వచ్చినా ధరణి పోర్టల్‌లో తమ సర్వే నంబర్, భూమి వివరాలు కనిపించనోళ్లు, అకారణంగా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ జాబితాలో భూమి చేరినోళ్లు, రిజిస్ట్రేషనైనా మ్యుటేషన్ కానోళ్లు ధరణితో పాటు ధరణి గ్రీవెన్స్‌ వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. గ్రీవెన్స్‌ వాట్సాప్‌ నంబర్‌కు మూడ్రోజుల్లోనే 17 వేల కంప్లైంట్స్​ వచ్చాయి. ప్రభుత్వం ప్రకటించిన ఈ మెయిల్‌కు మరో 3 వేల విజ్ఞప్తులు వచ్చాయి.
పార్ట్‌ బీలో 15 లక్షల ఎకరాలు
భూరికార్డుల ప్రక్షాళనప్పుడు రకరకాల కారణాలతో సుమారు 15 లక్షల ఎకరాల పట్టా భూములను పార్ట్ బీలో చేర్చారు. వీటికి పాస్ బుక్స్ జారీ కాకపోవడంతో బాధిత రైతులు ఇంకా తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. పార్ట్ బీ భూములపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో  అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. ధరణిలోనూ ఈ వివాదాలపై దరఖాస్తు చేసుకునే ఆప్షన్ లేదు. వీళ్లకు ప్రభుత్వం ప్రకటించిన వాట్సప్ నంబర్ కాస్త ఆశ కలిగించింది. వీళ్లంతా ఇప్పుడు ధరణి గ్రీవెన్స్ వాట్సప్ నంబర్​కు వినతులు పంపిస్తున్నారు. మరోవైపు అకారణంగా సుమారు 8 లక్షల ఎకరాల ప్రైవేట్ పట్టాభూములు, ఫ్రీడం ఫైటర్స్, మాజీ సైనికులకు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ జాబితాలో ప్రభుత్వం చేర్చింది.

మొత్తంగా ఒక్కో మండలం నుంచి 200 నుంచి 300 వరకు ఫిర్యాదు అందినట్టు తెలిసింది. ‘ధరణి పోర్టల్ ప్రారంభించాం.. భూ వివాదాలన్ని పరిష్కారమైనట్లే’ అని ప్రభుత్వ పెద్దలు సమర్థించుకున్నా ఫిర్యాదులు వెల్లువెత్తడం ధరణి లోపాలను ఎత్తి చూపుతోంది. 
ధరణి ద్వారా వచ్చిన అప్లికేషన్లు పెండింగ్‌లో.. 
అప్లికేషన్ ఫర్ పట్టాదారు పాస్ బుక్ (కోర్టు కేసు), ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టు నుంచి తొలగించడం, భూ సేకరణ వినతులు, మిస్సింగ్ సర్వే నంబర్లు, పేర్లు, ఆధార్, కులం, జెండర్ తప్పులు, ఫొటో మిస్ మ్యాచ్, డిజిటల్ సైన్ కాకపోవడం లాంటి సమస్యలపై ధరణి ద్వారానే అప్లై చేసుకునేలా సర్కారు వీలు కల్పించింది. ఈ పోర్టల్ ద్వారా వచ్చిన అప్లికేషన్లే ఒక్కో కలెక్టర్ దగ్గర 4 వేలకు పైగా ఉన్నట్లు తెలిసింది. వేర్వేరు పనుల వల్ల కలెక్టర్లు వీటిపై దృష్టి పెట్టకపోవడం, తహసీల్దార్లు రిపోర్టులు పంపకపోవడంతో ఇవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. కలెక్టర్లు క్లియర్ చేయకపోవడంతో  కొందరు బాధితులు 5 రోజులుగా మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేయడమూ భూ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించేలా చేసింది. కేటీఆర్‌కు ట్వీట్స్ పెరుగుతుండటంతో భూ సమస్యలపై ఫిర్యాదులకు వాట్సాప్ నంబర్ (9133089444)ను శుక్రవారం ప్రభుత్వం కేటాయించింది. ధరణిలో ఫిర్యాదు చేసే ఆప్షన్ లేని రైతులు ఈ నంబర్‌కు విజ్ఞప్తులు పంపుతున్నారు. 
రెవెన్యూ సిబ్బంది ఉరుకులు పరుగులు 
ధరణి పోర్టల్‌కు వస్తున్న దరఖాస్తులు, కేటీఆర్ ట్విట్టర్‌కు 5 రోజులుగా వస్తున్న వినతులు, వాట్సాప్ నంబర్, మెయిల్ ఐడీకి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు రెవెన్యూ సిబ్బందిని గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయి. పెండింగ్ దరఖాస్తులన్నింటిని మూడ్రోజుల్లో పరిష్కరించాలని, రైతుబంధుకు అర్హులను ఆ జాబితాలో చేర్చాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎస్ శనివారం ఆదేశించడంతో కలెక్టర్లు రెవెన్యూ సిబ్బందిని ఆదివారం పరుగులు పెట్టించారు. రిపోర్టులు పంపాలని ఆదేశించారు. దీంతో ఆదివారం రాత్రి వరకు తహసీల్దార్లు, ఆర్ఐలు ఆఫీసుల్లోనే రిపోర్టులను ప్రిపేర్‌ చేశారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో భూరికార్డులపై అవగాహన ఉన్న సిబ్బంది కరువయ్యారని.. రెండు, మూడు రోజుల్లో వంద, రెండొందల ఫిర్యాదులపై రిపోర్టులు ఎలా ప్రిపేర్‌ చేయగలమని తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలు ఆవేదన చెందుతున్నారు. 
మండలంలో ప్రతి పనికీ రెవెన్యూ సిబ్బందే 
ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఎమర్జెన్సీ సర్వీసెస్ జాబితా నుంచి రెవెన్యూ శాఖను తొలగించింది. మిగతా శాఖల్లా లాక్​డౌన్ సడలింపు టైంలోనే పని చేయాలని సీసీఎల్ఏ నుంచి ఉత్తర్వులొచ్చాయి. కానీ తహసీల్దార్లకు భూముల రిజిస్ట్రేషన్ పనులు రోజూ ఉంటున్నాయి. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణ, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిశీలన, కరోనా ఐసోలేషన్ సెంటర్ల నిర్వహణ, కల్యాణ లక్ష్మి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, భూసేకరణ పనులు లాంటి పనులూ రెవెన్యూ సిబ్బందిపైనే ఉన్నాయి. ప్రభుత్వ టార్గెట్ ప్రకారం డ్యూటీ చేస్తూ కరోనా బారినపడి ఇప్పటికే ఐదుగురు తహసీల్దార్లు, ముగ్గురు డీటీలతో పాటు వీఆర్వోలు, వీఆర్ఏలు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు కలిపి 85 మంది వరకు రెవెన్యూ సిబ్బంది ప్రాణాలొదిలారని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.