సేంద్రియ పంటతో లాభాలు వస్తయ్​

సేంద్రియ పంటతో లాభాలు వస్తయ్​

కెమికల్​ ఎరువులు లేని సాగు సాధ్యం కాదనేటోళ్లు ఒకప్పుడు.. కానీ,సేంద్రియ వ్యవసాయాన్ని మించింది మరొకటి లేదని రుజువు చేస్తున్నారు చాలామంది రైతులు. అందులోనూ నేచురల్ ఫార్మింగ్​లో  అరుదైన పంట లు పండిస్తున్నారు కొందరు. ఆ కోవకే చెందు తాడు మెదక్​ జిల్లాకి చెందిన సాయిరెడ్డి. 35 ఎకరాల్లో ఆరేండ్ల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు ఇతను. అరటి, జామతో పాటు డ్రాగన్​ ఫ్రూట్​ని పండిస్తున్నాడు. దీనంతటికీ ఇన్​స్పిరేషన్​ టీవీలో చూసిన సుభాష్​​ పాలేకర్​ స్పీచ్​ అని చెప్తున్నాడు. 

మెదక్​ జిల్లా చేగుంట మండలంలోని వల్లభాపూర్ సాయిరెడ్డి సొంతూరు. ఇంతకుముందు తనకున్న 35 ఎకరాల్లో చెరుకు పండించేవాడు. కానీ, కొన్నేండ్ల కిందట జిల్లాలోని చక్కెర ఫ్యాక్టరీ మూతపడి, పండించిన చెరుకు అమ్మడం కష్టమైంది. దాంతో చెరుకుకి ప్రత్యామ్నాయ పంటలు వెతకడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఆ టైంలోనే టీవీలో సుభాష్​ పాలేకర్​ స్పీచ్​ విన్నాడు. ఆయన ప్రేరణతో నేచురల్​ ఫార్మింగ్​ గురించి మరింత తెలుసుకున్నాడు. పాలేకర్​ పుస్తకాలు చదివాడు. క్లాసులకి వెళ్లాడు. పురుగుమందులు, రసాయనాల​ జోలికి పోకుండా తన పొలంలో పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా ఆరేండ్ల నుంచి సేంద్రియ బాటలోనే నడుస్తున్నాడు. మార్కెట్​లో డ్రాగన్​ ఫ్రూట్​కి ఉన్న డిమాండ్​ చూసి, ఎకరం విస్తీర్ణంలో దాన్ని కూడా సాగు చేస్తున్నాడు. 

మంచి రేటు పలుకుతున్నయ్​
ఇరవై ఎకరాల్లో అరటి, ఐదు ఎకరాల్లో తైవాన్​ జామ, ఒక ఎకరం డ్రాగన్​ ఫ్రూట్​తో పాటు మరికొన్ని పంటలు పండిస్తున్నాడు సాయిరెడ్డి. అరటిలో అంతర పంటగా అల్లం సాగు చేస్తున్నాడు. ఇదివరకు జామ, డ్రాగన్​ ఫ్రూట్​ తోట మధ్యలో అంతర పంటగా ఐదెకరాల్లో  కొలంబో కంది వేశాడు.  ఎకరాకు 12 చొప్పున 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అలాగే పొలంగట్ల వెంట 1,500 దేశవాళీ కొబ్బరి చెట్లు, వంద వరకు మామిడి చెట్లు పెంచుతున్నాడు. ఈ పంటలన్నింటికీ పది వేల లీటర్ల జీవామృతాన్ని పొలంలోనే తయారుచేస్తున్నాడు సాయిరెడ్డి. అందుకోసం ఇరవై ఆవులను పెంచుతున్నాడు. పొలంలోనే ఒక పెద్ద సిమెంట్​ ట్యాంక్,  కొన్ని ప్లాస్టిక్​ ట్యాంక్​లు ఏర్పాటు చేశాడు. వాటిలో ఆవుపేడ, మూత్రం, బెల్లం, శనగపిండి లాంటివి కలిపి జీవామృతాన్ని తయారుచేసి ఎరువుగా వేస్తున్నాడు. ‘‘సేంద్రియ సేద్యంలో కెమికల్​  ఎరువుల ఖర్చు ఉండదు. కానీ కలుపు నివారణ ఖర్చు కొంత ఎక్కువగా ఉంటుంది’’అంటున్నాడు సాయిరెడ్డి. పంట దిగుబడి కాస్త అటుఇటుగా ఉన్నా సేంద్రియ  పంటలకి మార్కెట్​లో  మంచి రేటు పలుకుతుందని చెప్తున్నాడు.

డ్రాగన్​ సాగుచేస్తున్నా
‘‘డ్రాగన్​ ఫ్రూట్​లో పోషక విలువలు, ఔషధ గుణాలు ఎక్కువ. అందుకే మార్కెట్​లో ​చాలా డిమాండ్ ఉంటుంది వీటికి. పైగా డ్రాగన్​ మొక్క ఒకసారి నాటితే 30 ఏండ్ల వరకు దిగుబడి వస్తుంది. పెట్టుబడికి పదింతలు ఎక్కువ లాభం వస్తుంది. అందుకే డ్రాగన్​ సాగు చేస్తున్నా. అది కూడా సేంద్రియ పద్ధతిలో. నేను పండించిన అరటి, జామ, డ్రాగన్​ ఫ్రూట్స్​ను మా ఊరికి దగ్గర్లోని 44వ నెంబర్​ నేషనల్​ హైవే మీదనే అమ్ముతున్నా. వేరే జిల్లాల నుంచి నన్ను కలవడానికి కొందరు రైతులు వస్తుంటారు. సేంద్రియ వ్యవసాయం గురించి అడిగి తెలుసుకుంటారు. అందరూ సేంద్రియ వ్యవసాయం వైపు నడిస్తే.. దేశమంతా ఆరోగ్యంగా ఉంటుంది’’ అంటున్నాడు సాయిరెడ్డి.