స్కూళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట.. 15 ఏండ్ల తర్వాత తెరుచుకున్న సర్కార్ బడి

స్కూళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట.. 15 ఏండ్ల తర్వాత తెరుచుకున్న సర్కార్ బడి
  • మంచిర్యాల జిల్లా కొత్త మామిడిపల్లిలో సందడి 

దండేపల్లి, వెలుగు: పదిహేనేండ్ల కింద మూతపడిన సర్కార్ బడి మళ్లీ తెరుచుకుంది. దీంతో పండగ వాతావరణం కనిపించింది. కాంగ్రెస్ ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల నియామకం, మౌలిక వసతులు కల్పిస్తూ పూర్వ వైభవం తీసుకొస్తోంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్ బడులకు పంపుతున్నారు.  

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లిలో ని బడికి విద్యార్థులు రాకపోవడంతో 15 ఏండ్ల కింద మూసేశారు.  తిరిగి ప్రారంభించాలని 15 నుంచి 20 మంది పిల్లలను సర్కార్ బడికి పంపిస్తామని గ్రామస్తులు హామీ ఇస్తూ ఎంఈఓ దుర్గం చిన్నయ్యకు వినతిపత్రం అందజేశారు.

 దీంతో మూత బడిన బడిని ఓపెన్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. స్కూల్ ను అందంగా అలంకరించి.. రంగుల బెలూన్స్, మామిడి తోరణాలతో తీర్చిదిద్దారు. బుధవారం మాజీ జెడ్పీటీసీ గడ్డం నాగరాణి త్రిమూర్తి, ఎంఈవో చిన్నయ్య బడిని రీ ఓపెన్ చేశారు. సుమారు10 మంది పిల్లలు బడికి రావడంతో గ్రామస్తులే విద్య వలంటీర్ ను నియమించారు.  

బడిని రీ ఓపెన్ చేస్తున్నట్లు డీఈఓకు సమాచారం ఇచ్చామని పిల్లలు సక్రమంగా బడికి వస్తే రేషనలైజేషన్ పద్ధతి లో టీచర్ ను నియమిస్తామని ఎంఈఓ తెలిపారు. కాగా.. స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఎప్పటికప్పుడూ తరచూ స్కూళ్లు, ఆస్పత్రులను తనిఖీ చేస్తున్నారు. 

దీంతో టీచర్లు, వైద్య సిబ్బందిలో మార్పు వస్తుండగా.. ప్రజలు కూడా సర్కార్ సేవల వైపు ఆసక్తి చూపుతున్నారు. కార్యక్రమంలో ఎస్ఐ తహసీనోద్దిన్, మాజీ సర్పంచ్ గడ్డం రాజయ్య, నేతలు గడ్డం రాంచందర్, బత్తుల రమేశ్, అక్కల కృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.