పథకాల అమలుకు కలెక్టర్లే మార్గదర్శకులు : పొంగులేటి

పథకాల అమలుకు కలెక్టర్లే మార్గదర్శకులు : పొంగులేటి
  • భూభారతి, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​పై ఫోకస్ పెట్టాలి: పొంగులేటి
  • పేదోడికి న్యాయం చేయాలి
  • ప్రతీ సోమవారం ఇందిరమ్మ ఇండ్లకు నిధులివ్వాలి
  • అనర్హులని తేలితే నిర్మాణం మధ్యలో ఉన్నా రద్దు చేస్తాం
  • పలు జిల్లాల కలెక్టర్లతో మంత్రి సమీక్ష

హైదరాబాద్, వెలుగు: భూభారతి చట్టం అమలు, ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి, వాటి ఫలితాలు పేదలందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించిన ఈ 2 పథకాలను విజయవంతంగా అమలు చేయడానికి కలెక్టర్లు నిరంతరం కృషి చేయాలని సూచించారు. సెక్రటేరియెట్​లోని తన ఆఫీస్​లో నిర్మల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, వనపర్తి జిల్లాల కలెక్టర్లతో భూభారతి, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలుపై మంత్రి పొంగులేటి బుధవారం సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘చట్టాన్ని రూపొందించడం ఒక ఎత్తైతే, దాన్ని అమలు చేయడం మరొక ఎత్తు. ఈ చట్టం ఫలితాలు ప్రతి పేదోడికి అందినప్పుడే చట్టం సార్థకత నెరవేరుతుంది. ఈ చట్టాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. రెవెన్యూ ఆఫీస్​కు వచ్చే సామాన్యుడు సైతం సంతోషపడేలా యంత్రాంగం పనిచేయాలి’’అని కలెక్టర్లకు మంత్రి పొంగులేటి సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, దాని ప్రభావం ఇందిరమ్మ ఇండ్లపై పడకుండా ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.

 ‘‘లబ్ధిదారుల ఎంపిక, ఇండ్ల మంజూరు, నిర్మాణ పనులను కచ్చితంగా పర్యవేక్షించాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి ఇండ్ల నిర్మాణాలను పరిశీలించాలి. అనర్హులని తేలితే ఇంటి నిర్మాణం మధ్యలో ఉన్నా.. రద్దు చేయడానికి వెనుకాడొద్దు. ప్రతి ఇల్లు అర్హులకే దక్కాలి”అని మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఒక్కో ఇంటికి 40 టన్నుల ఇసుక ఫ్రీగా ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్, ఇటుకల కోసం మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని.. వీలైనంత త్వరగా ఈ కమిటీలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

వరద బాధితులను కాపాడేందుకు ఎయిర్​లిఫ్ట్​ సిస్టమ్​ తేవాలి

రాష్ట్రంలో వాతావరణ సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులను రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. వర్షాలు, వరదల సమాచారాన్ని ఐఎండీతో సమన్వయం చేసుకుని.. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అందించేలా వ్యవస్థ రూపొందించా లని సూచించారు. వర్షాలు, వరదలకు సంబంధించి ఇరిగేషన్, విద్యుత్, హెల్త్, వ్యవసాయం, పోలీస్, రవాణా శాఖలకు ప్రత్యేక నోడల్ ఆఫీసర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన సీఎస్ రామకృష్ణారావు, విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్​ కుమార్‌‌‌‌తో కలిసి సెక్రటే రియెట్ లో గోదావరి, కృష్ణా నదీ పరివాహక జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విపత్తుల నిర్వహణ సంస్థను దేశానికే ఆదర్శంగా బలోపేతం చేస్తున్నా మన్నారు. పునర్ వ్యవస్థీకరించే రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థకు సీఎం చైర్మన్‌‌‌‌గా వ్యవహరిస్తారని చెప్పారు. రెవెన్యూ, హోమ్, ఆర్థిక, వైద్యారోగ్య, భారీ నీటిపారుదల, ఆర్​ అండ్​ బీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారన్నారు.  చీఫ్ సెక్రటరీ మెంబర్ కన్వీనర్‌‌‌‌గా, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారని వివరించారు. 

భారీ వర్షాల టైంలో వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎయిర్ లిఫ్ట్ మెకానిజంను సిద్ధం చేసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. వరదలతో ప్రభావితమయ్యే నదీ పరీవాహక ప్రాంత నివాసితులను ప్రతిసారి తరలించడం కంటే వారికి శాశ్వత నివాసాలు కల్పించాలన్నారు. ఇందు కోసం అర్హుల వివరాలను గుర్తించి అదనపు కోటా కింద ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు.