మొన్న వద్దనుకొని.. నేడు కావాలని..వదిలేసిన కొడుకును తిరిగివ్వాలని తల్లిదండ్రుల వేడుకోలు

మొన్న వద్దనుకొని.. నేడు కావాలని..వదిలేసిన కొడుకును తిరిగివ్వాలని తల్లిదండ్రుల వేడుకోలు
  • ఊయల నుంచి తల్లి ఒడి చేరిన చిన్నారి

కరీంనగర్, వెలుగు: మొన్న వద్దనుకుని ఊయలలో కొడుకును వదిలేసి వెళ్లిన తల్లిదండ్రులే ఇప్పుడు మనసు మార్చుకుని తమకు తిరిగివ్వండని ఆఫీసర్లను ప్రాధేయపడ్డారు. దీంతో 4 రోజుల పాటు కరీంనగర్  శిశుగృహ సంరక్షణలో ఉన్న బాబు బుధవారం తిరిగి తల్లి ఒడికి చేరాడు. సీడబ్ల్యూసీ అధికారుల కథనం ప్రకారం.. కరీంనగర్  మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఊయల(క్రెడిల్  బేబీ రిసెప్షన్  సెంటర్)లో జూన్ 28న 15 నెలల వయసు ఉన్న మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసిన విషయం తెలిసిందే.

ఆ శిశువుకు జీజీహెచ్  సూపరింటెండెంట్  డాక్టర్  వీరారెడ్డి, ఆర్ఎంవో నవీన, వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించి శిశుగృహకు తరలించారు. అయితే అప్పుడు వద్దనుకుని వదిలేసి వెళ్లిన  తల్లిదండ్రులే మళ్లీ మనసు మార్చుకుని తమ బాబు తమకు కావాలని బుధవారం సీడబ్ల్యూసీ అధికారులకు మొరపెట్టుకున్నారు. బాబు బాగోగులు తామే చూసుకుంటామని కోరారు. దీంతో సీడబ్ల్యూసీ అధికారులు వారి వద్ద ఆధారాలు, ఆధార్  కార్డ్, మెడికల్  రిపోర్టులు పరిశీలించి వారే తల్లిదండ్రులని నిర్ధారణకు వచ్చారు. అనంతరం దంపతులకు కౌన్సెలింగ్  నిర్వహించి జడ్పీలోని బాల రక్ష భవన్ లో బాబుని తిరిగి అప్పగించారు. తమ  బిడ్డను మళ్లీ చూస్తామో? లేదో? అని ఆవేదన చెందామని, కానీ, తమ బిడ్డను క్షేమంగా తిరిగి తమకు అప్పగించినందుకు జిల్లా యంత్రాంగానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.