మెట్ట పంటలు ఖల్లాస్.. పంటలను కాపాడుకోలేక రైతుల తిప్పలు

మెట్ట పంటలు ఖల్లాస్.. పంటలను కాపాడుకోలేక రైతుల తిప్పలు
  •     నడిగడ్డలో ఈ ఏడాది తగ్గిన సాగు విస్తీర్ణం
  •     పంటలను కాపాడుకోలేక రైతుల తిప్పలు
  •     బోర్లలోనూ అడుగంటుతున్న నీళ్లు, అయోమయంలో రైతులు

గద్వాల, వెలుగు : ఈ సీజన్​లో వానలు అంతంతమాత్రంగా కురవడంతో మెట్ట పంటలు ఎండిపోతున్నాయి. వానను నమ్ముకుని వేరుశనగ, జొన్నలు, పొద్దుతిరుగుడు, కందులు, ఆముదాలు, పత్తి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్​ ప్రారంభానికి ముందే సీడ్ పత్తి సాగు చేసిన రైతులు ఎండ వేడిమి, ఎర్ర తెగులు సోకి తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ఆ రైతులే మెట్టపంట సాగు చేసి, వానలు లేక మరోసారి నష్టపోవాల్సి వస్తోంది.

గత ఏడాది ఇదే సీజన్​లో4,01,813 ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఈ ఏడాది 3,32,737 ఎకరాల్లో మాత్రమే  పంటలు సాగయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 70 వేల ఎకరాల్లో సాగు తగ్గింది. వానలు లేక, భూగర్భ జలాలు పెరగక బోర్ల కింద సాగు చేసే రైతులకు కూడా తిప్పలు తప్పడం లేదు. మూడెకరాలు పారాల్సిన బోరు రెండెకరాలకే నీరందించే పరిస్థితి ఉంది. 

ఎండా కాలం మాదిరిగానే..

ఓ వైపు వర్షాలు లేకపోగా, మరోవైపు విపరీతమైన ఎండలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. 15 ఏండ్ల నుంచి ఇలాంటి వర్షాభావ పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని రైతులు వాపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు తీసేసి, మళ్లీ పంటలు వేయడంతో రైతులకు పెట్టుబడి పెరిగింది. రెండోసారి వేసిన పంటలు కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో ఆందోళన చెందుతున్నారు.

సాగు అంతంతమాత్రమే..

గద్వాల జిల్లాలో గత ఏడాది వరి 88,190 ఎకరాల్లో సాగు కాగా ఈ ఏడాది 70,277 ఎకరాలకే పరిమితమైంది. పత్తి గతంలో 2,22,930 ఎకరాల్లో  సాగవగా, ఈ సారి 1,36,610 ఎకరాల్లో మాత్రమే సాగయింది. ఇక పత్తి రైతులు ఇతర  పంటల వైపు మళ్లారు. గత ఏడాది 12 వేల ఎకరాల్లో ఆముదం సాగు కాగా, ఈ ఏడాది 1,400 ఎకరాలు, గత ఏడాది 5 వేల ఎకరాల్లో కూరగాయలు సాగు కాగా, ఈ ఏడాది 2,800 ఎకరాలకే పరిమితమైంది. వరి, పత్తి సాగు తగ్గించిన రైతులు ఉల్లి సాగు వైపు మొగ్గు చూపారు. గత ఏడాది 36 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేయగా, ఈ ఏడాది 60 వేల ఎకరాలకు చేరింది. కంది 12 వేల ఎకరాల నుంచి 21 వేల ఎకరాలకు చేరింది. చిరుధాన్యాలు, పప్పు దినుసుల పంటలు సాధారణంగానే సాగు చేశారు.

నల్ల రేగడిలో పొలాల్లోనూ అంతే..

జిల్లాలోని నల్లరేగడి భూముల్లో సాగు చేసిన మెట్ట పంటలు కూడా ఈసారి ఆశాజనకంగా లేవని రైతులు చెబుతున్నారు. అలంపూర్  నియోజకవర్గంలోని మానవపాడు, అలంపూరు, ఉండవెల్లి మండలాల్లో నల్లరేగడి భూములు ఎక్కువగా ఉన్నాయి. ఈ మూడు మండలాల్లో సాగు చేసిన పంటలు బాగానే ఉన్నప్పటికీ, దిగుబడి మాత్రం తగ్గుతుందని చెబుతున్నారు. అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల, గద్వాల నియోజకవర్గంలోని గట్టు,కేటిదొడ్డి, ధరూరు మండలాల్లోని మెట్ట పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది.

బోర్​లో నీళ్లు రావట్లే..

రెండు లక్షలు పెట్టి బోర్  వేసి మూడెకరాల్లో ఎకరాలు సాగు చేస్తున్న. రెండెకరాల్లో వేరుశనగ, ఎకరంలో వరి ఏస్తే బోర్ లో నీళ్లు రావట్లేదు. ఇప్పుడు ఎకరాకు కూడా నీరు సరిపోతలేవు. 

– హనుమంతు నాయక్, ఉమిత్యాల తండా