మహబూబ్ నగర్ లో యూరియా కోసం రైతుల పడిగాపులు

మహబూబ్ నగర్ లో యూరియా కోసం రైతుల పడిగాపులు

పాలమూరు, వెలుగు: మహబూబ్ నగర్ పట్టణంలోని  సహకార మార్కెటింగ్ సొసైటీ కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారు. గురువారం తెల్లవారుజాము నుంచి  క్యూలైన్లో చెప్పులు ఉంచి  యూరియా కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నారు.  వారం రోజుల నుంచి సహకార సంఘం కార్యాలయానికి  సరిపడ యూరియా రావడంలేదని రైతులు చెప్పారు. బుధవారం రాత్రి యూరియా లారీ లోడ్ వచ్చి సొసైటీ కార్యాలయం వద్ద దించుతున్నారన్న సమాచారంతో రైతులు అర్ధరాత్రి నుంచి భారీగా తరలివచ్చారు.  

తమ వంతు కోసం  రైతులు క్యూ లైన్ లో చెప్పులు పెట్టి మరి  ఎదురుచూస్తుండడంతో  తోపులాట జరిగింది.  అయితే ముందు జాగ్రత్తగా పోలీసులు  యూరియా  కేంద్రం వద్ద తోపులాట జరగకుండా  బందోబస్తు కల్పించారు.  ప్రస్తుతం గోదాంలో 300 బస్తా యూరియా ఉందని రైతులు 1000 మంది వరకు ఉన్నారని  మళ్లీ లోడ్ వచ్చాక యూరియా ఇస్తామని సహకార సంఘం  సిబ్బంది రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో  ఆందోళన వ్యక్తం చేశారు. 

అలంపూర్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేయడం మానుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, కేవీపీఎస్ మండల అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు.  గురువారం వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డికి సహకార సంఘం చైర్మన్ మోహన్ రెడ్డిలకు రైతులకు యూరియా కొరత తీర్చాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. 

వనపర్తి, వెలుగుః ఖిల్లాగణపురం, ఆత్మకూరు, అమరచింత, పాన్ గల్​, మండలాల్లో రైతులు యూరియా ఎరువుల కోసం తెల్లవారుజాము నుంచే క్యూలో పడిగాపులు కాస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఎరువులు రానున్నాయని రైతులు కోరిన మేరకు ఎరువులు ఇస్తామని వ్యవసాయాధికారి ఆంజనేయులు గౌడ్​ తెలిపారు.