బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా అడవుల్లోకి మరో పులి వచ్చినట్లు తెలుస్తోంది. రెండు రోజుల కింద వేమనపల్లి మండలం కొత్త జాజులపేట సమీపంలో ఒడ్డుగూడెం అటవీ బీట్ పరిధిలోకి వచ్చే పాచినీళ్ల తోవు వద్ద పులి సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానిక ఎఫ్‌ఎస్‌వో, బేస్ క్యాంప్ సిబ్బంది సైతం క్షేత్రస్థాయిలో పరిశీలించి పులి పాదముద్రలు సేకరించినట్లు సమాచారం.
సీసీ కెమెరాల్లోనూ ట్రాక్ అయినప్పటికీ పులి సమాచారాన్ని ఆఫీసర్లు బయటకు తెలియనీయడం లేదు. పులి పాచినీళ్లతోవు నుంచి మేదరికండి, మొండిగుట్ట మీదుగా కుమ్రం భీం జిల్లా రాంపూర్ అడవుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఫారెస్ట్ ఆఫీసర్లు పులి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు.
నిర్మల్ జిల్లా కుంటాలలో..
నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అంబుగాం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రెండు రోజుల కింద సూర్యాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు లేగ దూడను చంపగా మొదట చిరుత పులిగా అనుమానించిన అటవీ సిబ్బంది పాద ముద్రలను సేకరించారు.
లేగ దూడ కళేబరం చుట్టూ కెమెరాలను ఏర్పాటు చేయగా పెద్దపులి సంచరించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వేణుగోపాల్ ధ్రువీకరించారు. పెద్దపులి మహారాష్ట్ర వైపు నుంచి వచ్చినట్లు ఆఫీసర్లు అనుమానిస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.