- ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, వెలుగు: మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా, ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఏఐ ఆధారిత విద్యాబోధన చేయనున్నట్లు ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా విద్యాశాఖ సహకారంతో తలమడుగు మండలం బరంపూర్ జడ్పీ హైస్కూల్లో ధ్యేయ లెర్నింగ్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘లెర్న్ స్మార్ట్ విత్ ఏఐ’ కార్యక్రమాన్ని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్‌తో కలిసి కలెక్టర్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఏఐ టూల్స్‌పై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్‌లో పోటీ పరీక్షలు ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందన్నారు. ప్రస్తుతం 8వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. తొలి విడతగా ఐటీడీఏ పరిధిలోని రెండు స్కూళ్లు, విద్యాశాఖ పరిధిలోని 8 స్కూళ్లలో 600 మంది విద్యార్థులకు శిక్షణ అందించనున్నట్లు వివరించారు. చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ వంటి ఆధునిక ఏఐ టూల్స్‌ను విద్యార్థుల పాఠ్యాంశాలకు అనుగుణంగా బోధించనున్నట్లు తెలిపారు. ధ్యేయ సంస్థ సీఈవో ప్రణవి తదితరులుపాల్గొన్నారు.
