మెదక్ లో నాసిరకం విత్తనాలతో నష్టపోయిన రైతులు

మెదక్ లో  నాసిరకం విత్తనాలతో నష్టపోయిన రైతులు
  • కంపెనీ సూపర్​ వైజర్ల నిలదీత
  • రైతులపై పోలీసులకు ఫిర్యాదు 
  • మెదక్ జిల్లా శివ్వంపేటలో ఘటన  

శివ్వంపేట, వెలుగు: మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రానికి చెందిన ఆరుగురు రైతులు నాసిరకం విత్తనాలు వేసి నష్టపోయారు. యాసంగి సీజన్​లో క్యాప్సిన్ భావన వరి సీడ్స్ కొని 20  ఎకరాల్లో సాగు చేశారు. విత్తన కంపెనీ ప్రతినిధులు110 రోజులలో పంట వస్తుందని చెప్పారని, అయితే 120 రోజులవుతున్నా పంట దిగుబడి రావడం లేదని, ఎకరాకు 50 బస్తాలు వచ్చేది 5 బస్తాలు కూడా వచ్చేటట్టు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నకిలీ విత్తనాలు అంటగట్టడం వల్లే నష్టపోయామని మంగళవారం ఆందోళనకు దిగారు. భావన వరి సీడ్స్ కంపెనీ సూపర్​వైజర్లు ఫీల్డ్ ను పరిశీలించడానికి రాగా వారిని చుట్టుముట్టి గొడవకు దిగారు.

 తమకు నష్టపరిహారం ఇచ్చేంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. ఎకరాకు రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు సీడ్స్​ కంపెనీ వారు చెప్పిన మందులు ఐదు నుంచి ఆరు సార్లు పిచికారీ చేసినా వరిగొల వేయలేదని, కంపెనీ వారికి ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ విషయమై కంపెనీకి నివేదిక పంపిస్తామని చెప్పిన సూపర్​ వైజర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా పంటలు పరిశీలించేందుకు వెళ్తే రైతులు దాడి చేశారని సీడ్స్ కంపెనీ సూపర్​వైజర్లు నాగరాజు, నాందేవ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మహిపాల్ రెడ్డి తెలిపారు.