కలెక్టర్ మాటా చెల్లలేదు..!వరంగల్‍ జిల్లా రాయపర్తి మండల 200 మంది రైతుల ఆవేదన

కలెక్టర్ మాటా చెల్లలేదు..!వరంగల్‍ జిల్లా రాయపర్తి మండల 200 మంది రైతుల ఆవేదన
  • పొలాల బాట కోసం కలెక్టర్‍కు గోస చెప్పుకున్న రైతులు
  • చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కలెక్టర్ సత్యశారద
  • బండ్ల దారి ఉందని తేల్చి వదిలేసిన ఆఫీసర్లు 

వరంగల్/ రాయపర్తి, వెలుగు: వరంగల్‍ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని వందలాది రైతులకు సంబంధించి పొలాల బాట విషయంలో కలెక్టర్‍ సత్యశారద స్పందించి ఆదేశాలిచ్చినా, ఆఫీసర్లు మాత్రం దారి చూ పలేదు. సర్వే నిర్వహించి విచారణ ఆధారంగా బాట కోసం మార్కింగ్‍ పెట్టి, జేసీబీలతో హడావుడి చేసిన సిబ్బంది ఆపై అటువైపు చూడలేదు. అడుగు దూరంలో ఆగిన తమ సమస్య పరిష్కారానికి రైతులకు మూడు నెలలుగా ఎదురుచూపులు తప్పట్లేదు. కలెక్టర్‍ ఇచ్చిన ఆదేశాలు సైతం అమలు కాకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కలెక్టర్‍ ఆఫీస్‍ బాట పట్టిన రైతులు.. 

రైతుల కథనం మేరకు.. రాయపర్తి మండల కేంద్రానికి చెందిన దాదాపు 200 మంది రైతుల పొలాలకు తాతముత్తాతల కాలంగా మండల కేంద్రం మెయిన్‍ రోడ్డు నుంచి మారమ్మ గుడి వరకు పంట పొలాలకు వెళ్లేందుకు బండ్ల దారి ఉండేది. ఏండ్ల తరబడి రైతులు అలానే వెళ్తున్నారు. కాగా, ఏడాది నుంచి కొందరు వ్యక్తులు ఈ దారి మూసి అది తమ భూమిగా చెబుతున్నారు. రైతులు మాత్రం గ్రామ రెవెన్యూ పట్టాల్లో దారి ఉన్నట్లు తెలిపారు. ఇదే ప్రాంతంలో ఎస్సారెస్పీ చిన్నకాలువ ఉంది. కాలువ అభివృద్ధి పనులు, మరమ్మతుల కోసం సహజంగా కెనాల్‍కు ఇరువైపులా లారీ, ట్రాక్టర్‍ వంటి వాహనాలు వెళ్లేలా దారి ఉంటుంది. 

అయితే, ప్రస్తుతం ఆ దారి కూడా మాయమైంది. దీంతో ఏడాదిగా సాగు పనుల కోసం రైతు కుటుంబ సభ్యులు, అందులో పనిచేయడానికి వెళ్లే కూలీలకు దారి లేదు. ఈ విషయంలో రైతులకు, భూమి కబ్జా చేసినవారి మధ్య గొడవలు జరిగాయి. అధికారులు సర్వే చేపించి రికార్డుల్లో గతంలో బండ్ల దారి ఉన్నట్లు తేల్చి వదిలేశారు. ఆపై రైతులు ఎన్నిసార్లు తమ ఆవేదన చెప్పుకున్నా స్థానిక ఆఫీసర్లు స్పందించకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. పలుమార్లు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. 

జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో ఫిర్యాదులు అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఈ ఏడాది జూన్‍ 23న రైతులంతా మూకుమ్మడిగా రాయపర్తి నుంచి వరంగల్ కలెక్టరేట్‍ బాటపట్టి, నిరసన తెలిపారు. కలెక్టర్‍ సత్యశారద వారిని పిలిపించి సమస్య తెలుసుకున్నారు. తప్పకుండా న్యాయం చేసి రైతుల పొలాలకు దారి చూపిస్తామని హామీ ఇచ్చారు. 

సమస్య పరిష్కారం చివర్లో వదిలివెళ్లిన ఆఫీసర్లు..

రైతుల సమస్య కావడంతో కలెక్టర్‍ సత్యశారద స్పందించి ఆదేశాలివ్వడంతో మండల పరిధి ఆఫీసర్లు మరుసటిరోజే రైతుల పొలాల వద్దకు వెళ్లారు. రికార్డులు, సర్వేలను పరిశీలించారు. పొలాలకు ఏండ్ల తరబడి ఉన్న దారి దాదాపు 12 అడుగులు కబ్జా అయినట్లు గుర్తించారు. సదరు వ్యక్తులను పిలిపించి ఉన్నాతాధికారుల మాటగా దారి వెనక్కు ఇవ్వాలని సూచించారు. 

అయినా వారు మాట వినకపోవడంతో మార్కింగ్‍ పెట్టి జేసీబీలతో కొంతమేర క్లియర్‍ చేశారు. అంతాచేసి దారి మొదట్లో, చివర్లో 200 అడుగుల దూరం వరకు మాత్రం వదిలేశారు. నాలుగైదు రోజుల్లో పూర్తిస్థాయి సిబ్బందితో వచ్చి దారి క్లియర్‍ చేస్తామని చెప్పివెళ్లారు తప్పితే, మళ్లీ అటువైపు చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.