లఖింపూర్‌ ఖేరి హింస కేసుపై.. స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలి

లఖింపూర్‌ ఖేరి హింస కేసుపై.. స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలి

లఖింపూర్‌ ఖేరి హింస కేసుపై సుప్రీంకోర్టులో విచారణ  జరిగింది. ఈ కేసు దర్యాప్తుప బుధవారం న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయనుంది.  లఖింపూర్‌ ఖేరి  కేసు దర్యాప్తును పర్యవేక్షించేందుకు బయటి రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమించేందుకుఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. అయితే పంజాబ్,  హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి రాకేష్ కుమార్ జైన్ లేదా ఇతరులను పరిగణనలోకి తీసుకున్నందున దీనికి మరో రోజు సమయం కావాలంది సుప్రీం కోర్టు. సిట్‌లో మరికొంత మంది సీనియర్ పోలీసు అధికారులను కూడా చేర్చాలని యుపి రాష్ట్రాన్ని  సుప్రీంకోర్టు కోరింది. కేసు దర్యాప్తు కోసం యుపి పోలీసుల సిట్‌ను అప్‌గ్రేడ్ చేయాలని సూచించింది. 

రేపటిలోగా యూపీలోని ఐపీఎస్ అధికారుల జాబితాను ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.  సిట్‌లోని చాలా మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు లఖింపూర్ ఖేరీ స్థాయి వారేనని పేర్కొంది. గత విచారణ సందర్భంగా లఖింపూర్‌ ఖేరి కేసు దర్యాప్తును పర్యవేక్షించేందుకు యుపి కాకుండా ఇతర రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమించాలని రాష్ట్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటైర్డ్ న్యాయమూర్తులు రాకేష్ కుమార్ జైన్, రంజిత్ సింగ్ పేర్లను న్యాయస్థానం సూచించింది. 

అయితే గతంలో కూడా సుప్రీంకోర్టు ఈ కేసు విచారణపై   యూపీ ప్ర‌భుత్వ తీరును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. యూపీ ప్ర‌భుత్వం కోర్టుకు స‌మ‌ర్పించిన  స్టేట‌స్ రిపోర్ట్‌పై పెద‌వివిరిచింది. మ‌రింత మంది సాక్షుల‌ను విచారించామ‌ని ప్ర‌స్తావించ‌డం మిన‌హా ఈ నివేదికలో ఏమీ లేద‌ని యూపీ స‌ర్కార్‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్ధానం అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఈ కేసు ద‌ర్యాప్తు న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంద‌ని  సుప్రీంకోర్టు యూపీ ప్ర‌భుత్వానికి గతంలో అక్షింత‌లు వేసింది. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో కేంద్ర మంత్రి కుమారుడి కాన్వాయ్ లోని కారు ఢీకొని నలుగురు రైతులు మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలు, కారు డ్రైవర్, జర్నలిస్ట్ సహా నలుగురిని రైతులు కొట్టి చంపారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.