విత్తనాల కోసం రైతుల భారీ క్యూ ఆదిలాబాద్​లో ఉద్రిక్తత

విత్తనాల కోసం రైతుల భారీ క్యూ ఆదిలాబాద్​లో ఉద్రిక్తత
  • ఫర్టిలైజర్ ​షాపుల వద్ద తోసుకోవడంతో నెట్టివేసిన పోలీసులు  
  • లాఠీచార్జి జరిగిందన్న ప్రచారం 
  • అలాంటిదేం లేదన్న ఎస్పీ గౌస్ ఆలం

ఆదిలాబాద్, వెలుగు :  ఆదిలాబాద్​ జిల్లాలోని పలు షాపుల వద్ద పత్తి విత్తనాల కోసం రైతులు భారీగా లైన్లు కట్టారు. ఒక దశలో తోసుకోవడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి నెట్టివేయాల్సి వచ్చింది. అయితే, పోలీసులు రైతులపై లాఠీచార్జి చేశారన్న ప్రచారం జరిగింది. కొన్ని రోజులుగా ఆదిలాబాద్​లో రైతులు విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నారు. 

మంగళవారం కూడా  జిల్లాకేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపుల ఎదుట ఉదయం 6 గంటల నుంచే బారులు తీరారు. అంబేద్కర్ చౌక్ లోని షాపుల దగ్గర క్యూలైన్లు రోడ్డుపైకి వచ్చాయి. ఓ షాపులోకి ఒక్కసారిగా  పెద్ద సంఖ్యలో రైతులు చొచుకెళ్లేందుకు  ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. ముందుకు దూసుకువచ్చిన రైతులను పోలీసులు వెనక్కి నెట్టివేసి చెదరగొట్టారు. అయితే, పోలీసులు రైతులను కొట్టారన్న ప్రచారం జరిగింది. కొద్దిసేపటి తర్వాత రైతులను క్యూలో నిలబెట్టారు. కొన్ని చోట్ల మహిళ రైతులు కూడా లైన్లు కట్టారు. 

గంటల తరబడి లైన్ లో వేచి ఉన్నా డిమాండ్​ఉన్న విత్తనాలను ఒక్కొక్కరికి రెండు మాత్రమే ఇవ్వడంపై  రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులు విత్తనాలను మహారాష్ట్ర రైతులకు అమ్ముకుంటూ తమను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సరిపడినంత స్టాక్ ఉందని అధికారులు చెబుతుంటే, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి  ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. వ్యవసాయాధికారులు వచ్చి  రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రైతులందరూ ఒకే బ్రాండ్​ విత్తనాలు అడుగుతున్నారని, కంపెనీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య తెలిపారు. 

ఈ సీడ్​ ఇప్పటివరకు 40 వేల ప్యాకెట్లు వచ్చాయని, మరో మూడు రోజుల్లో 25 వేల  ప్యాకెట్లు వస్తాయని  చెప్పారు. రైతులు ఇబ్బంది పడకుండా సమయానికి విత్తనాలు అందేలా చూస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 55 కంపెనీలకు సంబంధించి 8 లక్షల సీడ్​ ప్యాకెట్లు వచ్చాయన్నారు.  విత్తనాలకోసం బారులు తీరిన రైతులతో ఎమ్మెల్యే పాయల్ శంకర్​ మాట్లాడారు. 

రాష్ట్రంలో ఏ విత్తనాలకు డిమాండ్ ఉందో ఆ విత్తనాల కొరత లేకుండా చూడాలని వ్యవసాయాధికారి పుల్లయ్యకు సూచించారు. రైతులపై లాఠీచార్జీని మాజీ మంత్రులు హరీశ్​రావు, కేటీఆర్ ​ఖండించారు. కాంగ్రెస్ వచ్చిన 5 నెలల్లోనే పరిస్థితి తారుమారైందన్నారు. రైతులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.  

లాఠీచార్జీ జరగలేదు : ఎస్పీ గౌస్​ ఆలం 

ఆదిలాబాద్​లో రైతులపై పోలీసులు లాఠీచార్జి  చేయలేదని ఎస్పీ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల మధ్య తోపులాట జరగకుండా వరుసలో నిల బెట్టేందుకు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. విత్త నాల కోసం వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారని, చెదరగొట్టారని జరుగుతున్న ప్రచారం నిజం కాదని,  దుకాణంలోకి దూసుకెళ్లకుండా ప్రశాంతంగా రైతులను వరుసలో ఉండేలా చూశారన్నారు.