చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ రద్దు చేయాలని414 రోజులుగా రైతుల దీక్ష

చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ రద్దు చేయాలని414 రోజులుగా రైతుల దీక్ష

గద్వాల, వెలుగు: నెట్టెంపాడులో భాగంగా చేపట్టిన చిన్నోనిపల్లి రిజర్వాయర్‌‌ను రద్దు చేయాలని 414 రోజులుగా నిర్వాసితులు దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు రద్దు చేస్తామని  గానీ, సమస్య పరిష్కరిస్తామని గానీ స్పష్టత ఇవ్వకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద, ఇందిరా పార్క్  దగ్గర రైతులు ఆందోళన చేశారు. 2006లో భూసేకరణ పూర్తయిన ఈ ప్రాజెక్టును ఇప్పటివరకు కంప్లీట్ చేయలేదని, దీంతో తాము ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నామని అంటున్నారు. తమ భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయకట్టు లేకపోయినా ఆర్డీఎస్ కు లింక్​ చేసేందుకు ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని చూస్తున్నారని అంటున్నారు. ఆర్డీఎస్ కు లింక్​ చేస్తే తుంగభద్ర నదిలో తెలంగాణకు ఉన్న 18 టీఎంసీల వాటా కోల్పోవాల్సిన వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రతిపక్షాల మద్దతు..

రిజర్వాయర్  ఆపేందుకు ఐదు గ్రామాల నిర్వాసిత రైతులకు ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. బీజేపీ, టీజేఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలుపుతున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, టీజేఎస్  నేత ప్రొఫెసర్ కోదండరాం, ఏఐసీసీ  కార్యదర్శి సంపత్ కుమార్, తీన్మార్ మల్లన్న నిరసనల్లో పాల్గొని ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. నెట్టెంపాడు లిఫ్ట్​ కోసం గట్టు మండలంలోని చిన్నోనిపల్లి దగ్గర రిజర్వాయర్  నిర్మించాలని అప్పట్లో ప్రపోజల్స్ పెట్టారు. చాగదోన, ఇందువాసి, గోయలగూడెం, లింగనవాయి గ్రామాల్లో 2650 ఎకరాలను 2006లో  సేకరించారు. కొంతమేర పనులు చేయగా, చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. పనులు పెండింగ్ లో ఉండడంతో ఆ భూముల్లో పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లాలో భూములకు డిమాండ్ పెరిగింది. అప్పట్లో ఎకరాకు రూ.75 వేలు ఇవ్వడంతో రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చిన్నోనిపల్లి గ్రామంలోని 250 ఇండ్లు ముంపునకు గురవుతుండగా, తొలి విడత పరిహారం అందించారు. అంతంపల్లి దగ్గర ఆర్‌‌అండ్‌ఆర్‌ ‌సెంటర్‌ ‌ఏర్పాటు చేయాలని నిర్ణయించి భూసేకరణ చేశారు.  ప్లాట్లు కేటాయించి వాటర్ ట్యాంక్,  డ్రైనేజీలు కట్టి వదిలేశారు. ప్రస్తుతం వాటర్  ట్యాంకు కూలిపోయే దశకు చేరుకుంది. సౌలతులు లేకపోవడంతో నిర్వాసితులు పాత గ్రామంలోనే ఉంటున్నారు. 

ఎక్కడి పనులు అక్కడే..

ఇక్కడి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్‌ మేరకు గత ఏడాది జనవరి 28న ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్  పనులను పరిశీలించి, 40 రోజుల్లో రిజర్వాయర్  వర్క్స్​ కంప్లీట్ చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు పనుల ఫోటోలు అప్​లోడ్ చేయాలని ఇరిగేషన్ ఇంజనీర్లకు సూచించారు. గ్రామానికి కరెంట్ కట్ చేసి, వాటర్ సప్లయ్ బంద్‌ పెట్టి  పనులు స్టార్ట్‌ చేయాలన్నారు. అయితే ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. జనవరి 30న పనులు చేసేందుకు ప్రయత్నించగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇతర ఆఫీసర్లు వెళ్లి నచ్చచెప్పినా వినలేదు. 

సమస్య కొలిక్కి రాలే..

చిన్నోనిపల్లి రిజర్వాయర్  సమస్య ఇంకా పెండింగ్‌లోనే ఉంది. రైతులు చేస్తున్న దీక్షను పై ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోయినం. రిజర్వాయర్  కింద ఆయకట్టు ఉన్నా, లేనట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రైతుల సమస్యకు పరిష్కారం చూపుతం.

- రహీమోద్దీన్, ఇరిగేషన్ ఈఈ