
వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ చేసిన ప్రకటన తనకు నచ్చలేదని బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి అన్నారు. దేశ రైతులు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనూ సంతృప్తి చెందలేదని ఆమె అన్నారు. వ్యవసాయ చట్టాలను ప్రధాని మోడీ నవంబర్ 19న రద్దు చేసినపుడు.. తాను వారణాసిలో ఉన్నానని.. అందుకే మూడు రోజులు ఆలస్యంగా స్పందిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. మోడీ ప్రకటన తనలాంటి వారినెందరినో బాధకు గురిచేసిందని ఆమె అన్నారు. వ్యవసాయ చట్టాల ప్రాముఖ్యతను రైతులకు వివరించడంలో మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఉమా భారతి అన్నారు. ఇది బీజేపీ కార్యకర్తల అసమర్థత అని ఆమె తప్పుబట్టారు. వ్యవసాయ చట్టాలపై విపక్షాలు చేస్తున్న నిరసనను బీజేపీ ఎదుర్కోలేకపోయిందని ఆమె అన్నారు. అందుకే ఆ రోజు ప్రధాని చేసిన ప్రసంగం చూసి చాలా కలత చెందానని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తన కుటుంబం ఇప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడి ఉందని ఆమె తెలిపారు.