ఒంటిపై సూసైడ్ నోట్...వరకట్న వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

ఒంటిపై సూసైడ్ నోట్...వరకట్న వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య
  • ఒంటిపై నోట్​రాసుకుని.. మహిళ సూసైడ్
  • ఉత్తరప్రదేశ్​లోని భాగ్​పథ్​లో దారుణం

లక్నో: వరకట్న వేధింపులను తట్టుకోలేక యూపీకి చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్తమామలు తనను వేధించిన తీరును తన ఒంటిపై రాసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఉత్తరప్రదేశ్‌‌లోని బాగ్‌‌పథ్‌‌లో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. బాగ్​పథ్‌‌కు చెందిన మనీషా(28)కు నోయిడాకు చెందిన కుందన్‌‌ కుమార్‌‌‌‌తో 2023లో పెండ్లయింది. ఆ తర్వాత కొద్దిరోజులకే భర్త, అత్తమామల నుంచి మనీషాకు వేధింపులు మొదలయ్యాయి. 

దనపు కట్నం కోసం ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. ఆ ఇబ్బందులు తట్టుకోలేక మనీషా 2024 జులైలో పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా వాళ్ల వేధింపులు ఆగలేదు. దీంతో తాను ఎదుర్కొన్న పరిస్థితులను చేతులు, కాళ్లు, నడుముపై పెన్‌‌తో రాసుకుని.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ‘‘నా చావుకు భర్త, అత్తింటివాళ్లే కారణం. నన్ను, నా ఫ్యామిలీని చంపేస్తానని కుందన్‌‌ బెదిరించాడు. అందుకే ప్రాణం తీసుకుంటున్నా” అని రాసుకుంది. 

భర్త.. అతని సోదరుడు, అత్తామామలు కట్నం కోసం తనను ఎలా వేధిస్తున్నారో వివరిస్తూ మనీషా రికార్డ్‌‌ చేసిన వీడియోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘‘కట్నంగా రూ.20 లక్షలు, బుల్లెట్‌‌ బండి ఇచ్చి పెండ్లి చేశారు. ఇంకా పెద్దమొత్తంలో డబ్బు కావాలంటూ కుందన్‌‌ నన్ను చాలాసార్లు కొట్టాడు. 

అబార్షన్‌‌ చేయించుకోవాలని బలవంతం చేశాడు, అత్తామామలు కరెంట్‌‌ షాకిచ్చి నన్ను చంపాలని చూశారు” అని వీడియోలో మనీషా వివరించింది. మనీషా తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.