
- రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ మెంబర్ భూమి సునీల్
సూర్యాపేట, వెలుగు : రైతులు సాగు చట్టాలు తెలుసుకోవాలని, వాటిని వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ వ్యవసాయ, రైతు కమిషన్ మెంబర్ భూమి సునీల్ సూచించారు. దుక్కి దున్నే నాటి నుంచి పండించిన పంటను అమ్ముకునే దాకా రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యవసాయంలో వస్తున్న మార్పులు, సవాళ్లకు తగ్గట్టుగా సాగు సాఫీగా సాగడానికి ఎన్నో చట్టాలు వచ్చాయన్నారు. శుక్రవారం సూర్యాపేట తహసీల్దార్ ఆఫీసులో రైతులకు భూమి, సాగు చట్టాలపై అవగాహన కల్పించారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండు వందలకుపైగా చట్టాలు అమలులో ఉన్నాయని, వీటిని రైతులు తెలుసుకొని వినియోగించుకోగలిగితే ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. భూ సమస్య వచ్చినప్పుడు, నాణ్యతలేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో నష్టం కలిగినప్పడు, మార్కెటింగ్ మోసాలు, పంటల బీమా అందనప్పుడు రైతులకు చట్టాలతో అవసరమవుతాయన్నారు. సాగు చట్టాలపై లక్ష మంది రైతులకు అవగాహన కల్పించడం, న్యాయ అవసరాలపై స్టడీ చేయడానికి లీఫ్స్ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా జూన్ 28 నుంచి అక్టోబర్ 2 వరకు 8 వేల గ్రామాల్లో 2, 400 కిలోమీటర్లు పర్యటిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ మెంబర్ , డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, సూర్యాపేట తహసీల్దార్ కృష్ణయ్య, రైతులు పాల్గొన్నారు.