బాసర ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ : శ్రీధర్ బాబు

బాసర ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ :  శ్రీధర్ బాబు
  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

బాసర, వెలుగు: మాస్టర్ ప్లాన్ ద్వారా బాసర సరస్వతిదేవి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఇప్పటికే ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టి పెట్టారని చెప్పారు. శుక్రవారం మంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి బాసర టెంపుల్ ను సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

ముందుగా మంత్రికి ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణతో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే మహంకాళి, దత్తాత్రేయ స్వామిని కూడా మంత్రి దర్శించుకున్నారు. అంతకు ముందు ఐఐఐటీ వసతి గృహంలో మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో కోమల్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ పాఠక్, ఈవో సుదర్శన్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.