ఆ ఊరికి శాపంగా ధరణి .. అసైన్డ్గా మారిన కంజర గ్రామస్తుల పట్టా భూములు

ఆ ఊరికి శాపంగా ధరణి .. అసైన్డ్గా మారిన కంజర గ్రామస్తుల పట్టా భూములు
  • 1000 ఎకరాల భూముల రైతులకు తిప్పలు
  • నిలిచిపోయిన క్రయవిక్రయాలు
  • ఇబ్బందులు పడుతున్న 312 కుటుంబాలు
  • భూభారతిలోనూ పరిష్కారం కాని సమస్య

నిర్మల్, వెలుగు: ధరణి ఆ గ్రామానికి శాపంగా మారింది. ధరణి కారణంగా ఆ గ్రామ రైతులు తమ భూమిపై హక్కులు కోల్పోయారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరావాస గ్రామమైన నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలంలోని న్యూ కంజర రైతులకు 1982లో అప్పటి ప్రభుత్వం దాదాపు వేయి ఎకరాలు కేటాయించింది. అధికారులు డీ వన్ పట్టాలతో సేత్వార్లు జారీచేసి సబ్ డివిజన్ ఏర్పాటు చేశా రు.  దీంతో ఆ భూములపై రైతులకు పూర్తి హక్కులు వచ్చాయి. వాటిని అమ్ముకునే అధికారం కూడా దక్కింది. 

అయితే ధరణి పోర్టల్ మొదలు కాగానే ఆ ఊరిలోని భూముల వివరాలన్నీ అసైన్డ్​గా నమోదయ్యాయి. సర్వే నంబర్లన్నీ అసైన్డ్ భూముల జాబితాలోకి చేరిపోవడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ భూముల వివరాలు బ్లాక్ లిస్ట్​లోకి చేరిపోయాయి. ఫలితంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో క్రయవిక్రయాలు బంద్​ అయ్యాయి. కాంగ్రెస్​ప్రభుత్వ తీసుకొచ్చిన భూభారతి అసైన్డ్​ మాడ్యూల్​ లేకపోవడంతో సమస్య పరిష్కారం కావడంలేదు.

 మంత్రులకు, అధికారులకు వినతుల వెల్లువ 

ఎస్సారెస్పీ పరిధిలోని మొత్తం 63 ముంపు గ్రామాల్లో ఎక్కడ లేని విధంగా కేవలం తమ గ్రామానికి అసైన్డ్ వ్యవహారం శాపంగా మారిందని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామానికి చెందిన దాదాపు 312 రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. అత్యవసర సమయాల్లో తమ భూములు అమ్ముకోలేని పరిస్థితులు నెలకొన్నాయని వాపోతున్నారు. అసైన్డ్ జాబితా నుంచి తొలగించి పట్టా భూములుగా మార్చాలని దాదాపు పదేండ్లుగా పోరాడుతున్నారు. అప్పటి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా తమ గోడు వెల్లబోసుకున్నారు. అయినప్పటికీ తమ సమస్య పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భైంసా పర్యటనకు వచ్చిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టి కూడా  సమస్య తీసుకెళ్లారు. 

సర్కారుకు కలెక్టర్ లేఖ రాసినా..

పొట్టపల్లి బి గ్రామంలో 84 ఎకరాలు, పొట్టపల్లి కెలో 37 ఎకరాలు కూడా అసైన్డ్ జాబితాలోకి చేరాయి. వారు కూడా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. దీంతో 2023లో అప్పటి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఈ మూడు గ్రామానికి సంబంధించిన 611 సబ్ డివిజన్లను, సర్వే నంబర్ల భూములను టీఎం 33 మాడ్యూల్ కింద డాటా కరెక్షన్ చేసి అసైన్డ్ భూముల జాబితా నుంచి పట్టా భూములుగా మార్చాలని కోరుతూ సీసీఎల్ఏకు లేఖ రాశారు. అయినప్పటికీ ఉన్నతాధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోలేదు. 

సమస్యను వెంటనే పరిష్కరించాలి

మా గ్రామంలోని పట్టా భూములన్నీ అసైన్డ్ భూములుగా మారిపోయాయి. ధరణి పుణ్యమా అని మా భూములను మేము అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో భూముల క్రయవిక్రయాలు జరిగాయి. కానీ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత మా భూములు బ్లాక్ లిస్టులో చేరిపోయాయి. ఇప్పటికే చాలాసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితంలేదు. భూభారతిలోనూ మార్పు మాడ్యూల్ లేకపోవడంతో ఇబ్బందులు తీరలేదు. ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించాలి.

 లక్ష్మారెడ్డి, రైతు, న్యూ కంజర గ్రామం