మీరు వేసే పన్నులు, ఒప్పందాల్లో మా రైతులను వదిలేయండి : అమెరికాకు ఇండియా రిక్వెస్ట్

మీరు వేసే పన్నులు, ఒప్పందాల్లో మా రైతులను వదిలేయండి : అమెరికాకు ఇండియా రిక్వెస్ట్

US-India Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత బృందం కొన్ని వారాలుగా చర్చలు కొనసాగిస్తూనే ఉంది. అయితే అమెరికా అడుగుతున్నదానికి ఇండియా అంగీకరించకపోవటం ఈ చర్చలను సుదీర్ఘంగా సాగదీస్తున్నాయి. అయితే మరోపక్క అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం అదిగో డీల్ అయిపోవచ్చింది.. ఇదిగో ఇండియా తమ డిమాండ్లకు అంగీకరించబోతోందంటూ మీడియాలో కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే ట్రంప్ చెబుతున్న దానికి వాస్తవ పరిస్థితులకు మధ్య కొంత వ్యత్యాసం ఉంది. 

అయితే అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై రైతు సంఘాల్లో కూడా ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా భారత రైతు ఉద్యమాల సమన్వయ కమిటీ కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల్లో వ్యవసాయ ఉత్పత్తులను పక్కనపెట్టాలని కోరింది. భారతీయ రైతుల ప్రయోజనాలకు హాని కలిగించే షరతులు, ఒప్పందాలను నిలిపివేయాలని భారత ప్రభుత్వానికి సూచించింది. ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో జీవశక్తిని కాపాడాలని కోరింది.

అమెరికా అగ్రి, డెయిరీ ఉత్పత్తులను భారతదేశంలోకి పన్నులు లేకుండా అనుమతించటం చాలా ప్రమాదకరమని రైతు సంఘం హెచ్చరించింది. ఇప్పటికే అమెరికా ఇండియా మధ్య డీల్ కోసం ఐదవ దఫా చర్చలు జరుగుతుండగా అమెరికా తమ అగ్రి ఉత్పత్తులను అనుమతించాలని కోరుతుండగా భారత్ మాత్రం నిర్మొహమాటంగా నిరాకరిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. 

ALSO READ : లోన్ మెుత్తం కట్టేసినా మీ క్రెడిట్ రిపోర్ట్ అప్‌డేట్ కాలేదా..? అయితే ఇలా చేయండి

ప్రధానంగా అమెరికా చైనా, మెక్సికో, కెనడాలతో 2018 నుంచి వాణిజ్య యుద్ధాన్ని కొనసాగించటంతో యూఎస్ అగ్రి ఉత్పత్తుల ఎగుమతులు భారీగా దెబ్బతిన్నాయి. అయితే వీటిని ఇండియా వంటి అధిక జనాభా కలిగిన దేశాలకు రీరూట్ చేయాలని యూఎస్ ప్లాన్ చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. అయితే అమెరికాలో ప్రభుత్వం అక్కడి రైతులకు అందించే భారీ సబ్సిడీల కారణంగా ఉత్పత్తులు తక్కువ రేట్లకు ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వటం ఇక్కడి రైతులను, వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

అలాగే మెుక్క జొన్న, సోయా, పత్తి, ఆపిల్స్, కెనోలా వంటి ఉత్పత్తులను అమెరికా నుంచి భారతదేశంలోకి దిగుమతి అంగీకరించటం వల్ల బయో సేఫ్టీ దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే జన్యు పరంగా మార్పిడి చేసిన ఆహారాలు భారతీయ ప్రజల ఆరోగ్యాలను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. అందుకే వాణిజ్య ఒప్పందంలో అగ్రి ఉత్పత్తులను పక్కనపెట్టాలని, పన్ను రహిత దిగుమతులకు భారత్ అంగీకరించకూడదని వారు కోరుతున్నారు.