తాలు, తేమ పేరుతో దోపిడీ..సీఈవోను నిర్బంధించిన రైతులు

తాలు, తేమ పేరుతో దోపిడీ..సీఈవోను నిర్బంధించిన రైతులు
  •     పోలీసులు చెప్పినా వినలే
  •     ఎమ్మెల్యే హామీతో తాళం తీసిన్రు
  •     నల్గొండ జిల్లా మర్రిగూడలో ఉద్రిక్తత 

మర్రిగూడ (చండూరు) వెలుగు: తాలు, తేమ పేరుతో దోచుకుంటున్నారని ఆరోపిస్తూ మంగళవారం మర్రిగూడ మండల కేంద్రంలోని రైతు సహకార సంఘం వద్ద రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా దోపిడీపై రైతులు..సీఈఓ శ్రీనివాస్​ను ప్రశ్నించగా ‘మీరు తెచ్చిన వడ్లకు తగ్గట్టే కోత ఉంటుంది’ అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో రైతులు ఆయనతో పాటు సిబ్బందిని ఆఫీసు లోపలేసి నిర్బంధించారు. రైతులు మాట్లాడుతూ దళారుల కంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ఎక్కువ దోచుకుంటున్నారన్నారు. బస్తాకు 5 కిలోల నుంచి 8 కిలోల వరకు తరుగు తీస్తున్నారని ఆరోపించారు. న్యాయం జరిగేంత వరకు ఆందోళన ఆపేది లేదని, లోపలున్న వారిని విడిచిపెట్టేది లేదని బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ఆందోళన విరమించాలని కోరినా వినలేదు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో మండల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అక్కడికి వచ్చారు. రైతులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి సీఈఓ, సిబ్బందిని విడిచిపెట్టారు.