
గద్వాల/ కేటిదొడ్డి, వెలుగు: నెట్టెంపాడు లిఫ్ట్ కింద 104 ప్యాకేజీలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు బుధవారం గద్వాల–రాయచూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నెట్టెంపాడు లిఫ్ట్‌లోని 104 ప్యాకేజీ కింద సాగునీరు అందక ఇప్పటికే వేల ఎకరాలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలకు మోటార్లు పెట్టి నీటిని వాడుకుంటున్నారని వాపోయారు. దీంతో గువ్వలదిన్నె, వెంకటాపురం, కొండాపురం చివరి ఆయకట్టుకు నీళ్లు అందడం లేదన్నారు.
సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆఫీసర్లను కలవాలని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకొని నిరసన తెలిపారు. కెనాల్ పై ఇల్లీగల్ గా మోటార్లు ఏర్పాటు చేస్తున్నారని, దీంతో తమకు సాగునీరు అందడం లేదన్నారు. మోటార్ల ద్వారా నీటిని ఎక్కువగా తోడి వేయడంతో ఈ పరిస్థితి ఉందన్నారు. అనంతరం కలెక్టర్ సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు.