మొలకెత్తిన వడ్లతో రైతుల రాస్తారోకో

మొలకెత్తిన వడ్లతో రైతుల రాస్తారోకో
  • సొసైటీ సీఈవోను అడ్డుకుని నిలదీత
  • మెదక్ జిల్లా శివ్వంపేటలో ఘటన

శివ్వంపేట, వెలుగు: కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ .. వర్షాలకు తడిసి మొలకెత్తిన వడ్లతో రైతులు ఆందోళనకు దిగారు. వడ్లు తీసుకు వచ్చి నెల రోజులైనా తూకం వేయడం లేదని,  అకాల వర్షాలకు తడిసిపోయి మొలకెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారులు పట్టించుకోకపోవడంతో కష్టపడి పండించిన పంట తడిసి మొలకెత్తిందని ఆవేదనతో చెప్పారు. 

సొసైటీ చైర్మన్, తహసీల్దార్, కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సొసైటీ సీఈవో మధును అడ్డుకుని నిలదీశారు. రైతుల రాస్తారోకోతో నర్సాపూర్, తూప్రాన్ మెయిన్ రోడ్డు మీద ట్రాఫిక్ స్తంభించి ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు రైతులకు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు.