
మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో మొత్తం 22 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కొనుగోలు చేసిన వడ్లను మండల కేంద్రంలోని ఓం సాయి వెంకట రమణ రైస్ మిల్కు తరలిస్తున్నారు. అయితే మిల్వద్ద అన్లోడింగ్ లేట్ అవుతోంది. రైస్‌మిల్ నిర్వాహకులు డైలీ 3,500 నుంచి 4 వేల బస్తాలకు మించి దించుకోవడం లేదు. మండలంలో పారా బాయిల్డ్ రైస్‌మిల్ ఇదొక్కటే కావడంతో కెపాసిటీకి సరిపడా, సీరియల్ప్రకారమే తీసుకుంటున్నామని మిల్లర్లు చెబుతున్నారు. దీంతో వడ్ల బస్తాలతో రైస్ మిల్కు వస్తున్న ట్రాక్టర్లు మూడు నుంచి నాలుగు రోజులు రోడ్ల వెంట బారులు తీరాల్సి వస్తోంది.
ఈ ఎఫెక్ట్ కొనుగోళ్లపై పడుతోంది. కాంటాలు పెట్టకపోవడంతో పొలాలు, రోడ్ల వెంట పోసిన వడ్ల కుప్పల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. చిన్న గొట్టిముక్కుల నుంచి సికింద్లాపూర్ వరకు దాదాపు 8 కిలోమీటర్ల మేర నర్సాపూర్ – తూప్రాన్ మెయిన్ రోడ్డుపై వడ్ల కుప్పలు కనిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి వెంటవెంటనే అన్లోడ్అయ్యేలా చూడాలని, కాంటాలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
– వెలుగు, మెదక్(శివ్వంపేట)