ప్రాణాలు పోయినా భూములివ్వం

ప్రాణాలు పోయినా భూములివ్వం
  • పురుగుల మందు డబ్బాలతో రైతుల ఆందోళన
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ టౌన్ పరిధిలో నిరసన

హుస్నాబాద్, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్టు కింద ఉప కాల్వ నిర్మాణ సర్వేను అడ్డుకుంటూ హుస్నాబాద్ రైతులు ఆందోళనకు దిగారు. ‘‘  మా ప్రాణాలు పోయినా.. మా భూములు ఇవ్వం’’ అంటూ పురుగుల మందు డబ్బాలు పట్టుకుని నిరసన తెలిపారు. మంగళవారం హుస్నాబాద్ టౌన్ పరిధి డబుల్ బెడ్రూమ్ కాలనీ వద్ద సర్వే చేసేందుకు అధికారులు రాగా రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తహసీల్దార్ లక్ష్మారెడ్డి వెళ్లి రైతులతో మాట్లాడారు. ముందుగా సమాచారం ఇచ్చి, చర్చించాకే సర్వే చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు డీ4 (17.5 కి.మీ.), 13ఎల్ (14.5 కి.మీ.) కాల్వల నిర్మాణంతో తమ పంటలు, భూములు నష్టపోతున్నామని పేర్కొన్నారు. 

తరచూ నీరు లీకైతుండడంతో పంటలు ఖరాబ్ అయితున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డీ – 4 కాల్వ నుంచి 13ఎల్ కాల్వకు నీటి కనెక్షన్ రద్దు చేయాలని, పంట నష్టాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే డీ–4 కాల్వ నిర్మాణంలో కొంత భూమి కోల్పోయామని, ఇప్పుడు ఉప కాల్వ పేరిట మిగిలిన భూములు కూడా పోతాయని ఆందోళనకు దిగినట్టు పలువురు రైతులు తెలిపారు.