
మరికల్/అలంపూర్/కోడేరు, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. మరికల్లో పోలీస్ బందోబస్తు నడుమ రైతులకు యూరియా పంపిణీ చేశారు. అగ్రో రైతు సేవా కేంద్రం, గ్రోమోర్ సెంటర్లకు 900 బస్తాల యూరియా రాగా, రెండు రోజుల కింద టోకెన్లు తీసుకున్న రైతులకు వాటిని అందజేశారు. అలంపూర్ లో యూరియా కోసం రైతులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్యూలో నిలుచున్నారు.
గంటల తరబడి వర్షంలో నిలబడి యూరియా తీసుకున్నారు. అలంపూర్ సొసైటీకి 450 బస్తాలు రాగా, 225 మంది రైతులకు అందజేసినట్లు సీఈవో శ్రీనివాసులు తెలిపారు. రైతులకు యూరియా అందజేయాలని కోడేరులో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పీఏసీఎస్ గోదాం వద్ద రైతులు ధర్నా చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాసులు, రాములు, బాలస్వామి, సుబ్బయ్య, మల్లయ్య, స్వామి, మాసయ్య, రాజేశ్ పాల్గొన్నారు.