
- ఈసారి 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా
- ఇందులో 66 లక్షల ఎకరాల్లో వరి, 50 లక్షల ఎకరాల్లో పత్తి
- అందుకు తగ్గట్టు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసిన అధికారులు
హైదరాబాద్. వెలుగు: ఈసారి ముందుగానే వానాకాలం రావడంతో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. దుక్కులు దున్నుతూ, విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. గత వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 1.29 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, ఈసారి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబతున్నారు.
ఈ వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందులో 66.80 లక్షల ఎకరాల్లో వరి, 50 లక్షల ఎకరాల్లో పత్తి, 6లక్షల ఎకరాల్లో మక్క, 5.50లక్షల ఎకరాల్లో కంది, 4.50లక్షల ఎకరాల్లో సోయా సాగు చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, ఈ వానాకాలం సీజన్లో ముందస్తు సాగుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
మార్చి, ఏప్రిల్ నెలల్లో అకాల వర్షాలతో యాసంగి పంట నష్టం జరుగుతున్న నేపథ్యంలో జూన్ లో వరి నార్లు పోసి, జులైలో నాట్లు ప్రారంభించి, సెప్టెంబర్ నాటికి కోతలు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నా రు. ఆ వెంటనే యాసంగి పంటల సీజన్ ప్రారంభిస్తే, అవి ముందుగానే కోతకు వచ్చి.. వాటిపై అకాల వర్షాల ప్రభావం తగ్గుతుందని అధికారులు చెబుతు న్నారు.
విత్తనాలు, ఎరువులు రెడీ..
వానాకాలం సీజన్ కు అవసరమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. పత్తి సాగుకోసం 1.50 కోట్ల కాటన్ సీడ్ ప్యాకెట్లు అధికారులు సిద్ధం చేస్తు న్నారు. ఒక్కో ప్యాకెట్ (450 గ్రాములు)ను రూ.901 చొప్పున ప్రైవేట్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి.
ఇక వరి, మక్క, సోయా తదితర పంటలకు 16 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా.
ఇందులో తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కా ర్పొరేషన్ (టీఎస్ఎస్డీసీ) 5.50 లక్షల క్వింటాళ్లు. నేషనల్ సీడ్ కార్పొరేషన్ 55 వేల క్వింటాళ్లు, అగ్రి కల్చర్ యూనివర్సిటీ 8,500 క్వింటాళ్లు సరఫరా చేస్తున్నాయి. మిగతా విత్తనాల సరఫరా బాధ్యత ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారు.
పచ్చిరొట్ట విత్త నాలైన జీలుగు, జనుము, పిల్లి పెసరలను 50% సబ్సిడీతో పంపిణీ చేస్తున్నారు. కాగా, యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఎంఓపీ, ఎస్ఎస్పి వంటి ఎరువులు 20 లక్షల టన్నులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇందులో యూరియా 12 లక్షల టన్నుల వరకు అవసరమవుతుందని తెలిపారు. కేంద్రం ఈ ఏడాది 9.80 లక్షల టన్నుల యూరియాను కేటా యించగా ఏప్రిల్లో 1.20 లక్షల టన్నులు, మేలో 52 వేల టన్నులు మాత్రమే సరఫరా అయింది. మిగతా యూరియాను వెంటనే సరఫరా చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. జూన్ మొదటి వారం నాటికి ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నారు.