ఇండ్లలోనే పత్తి..రేటు వచ్చే దాకా అమ్మేది లేదంటున్న రైతులు

ఇండ్లలోనే పత్తి..రేటు వచ్చే దాకా అమ్మేది లేదంటున్న రైతులు

మహబూబ్ నగర్, వెలుగు: పత్తి రైతులను వ్యాపారులు నిండా ముంచుతున్నారు. సీజన్ మొదట్లో క్వింటాల్ ​పత్తిని రూ.8 వేల నుంచి రూ.9వేల వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు మార్కెట్లకు దిగుబడుల రాక పెరగడంతో సిండికేటుగా రేటు తగ్గిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం క్వింటాల్​కు రూ.6 వేల నుంచి రూ.7వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. మొదటి విడత పత్తినే తక్కువకు అడుగుతుండడంతో రైతులు పంటను ఇండ్లల్లోనే స్టాక్​పెట్టుకుంటున్నారు. ముందాడి తీసిన పత్తి క్వాలిటీ బాగుంటుందని, మంచి రేటు వచ్చాకే అమ్ముకుంటామని చెబుతున్నారు. గతేడాది దిగుబడి తక్కువ రాగా, క్వింటాల్ పత్తి రేటు రూ.9 వేల నుంచి రూ.13 వేల వరకు పలికింది. లాభాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈ సీజన్​లో ఎక్కువగా పత్తిని సాగు చేశారు. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఈసారి 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఒక్క ఉమ్మడి పాలమూరులోనే 10.48 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. ఏటా సెప్టెంబర్ చివరి నుంచి పత్తిని ఏరి, అక్టోబరులో మార్కెట్ కు తెచ్చేవారు. అయితే ఇప్పుడున్న రేటు గిట్టుబాటు కాదని భావిస్తున్న రైతులు మార్కెట్లకు సరుకును తేవడం లేదు. 

నెలలో రూ.2 వేలు తగ్గింపు

జూన్, జులైలో వేసిన పత్తి అక్టోబర్​ రెండో వారం నుంచి మార్కెట్లకు వస్తుంది. మొదట్లో వ్యాపారులు ఎంఎస్​పీ(మినిమం సపోర్ట్​ప్రైస్) కన్నా ఎక్కువ రేటు చెల్లించారు. రూ.7,290 నుంచి రూ.9,001వరకు కొన్నారు. జులై, ఆగస్టులో వేసిన పత్తి నవంబరులో మార్కెట్లలోకి వస్తుంది. నవంబర్​మొదటి వారం నుంచి భారీగా పత్తి వస్తుండడంతో వ్యాపారులు రేట్లను తగ్గిస్తున్నారు. క్వింటాల్​పై రూ.200 నుంచి 500 వరకు తగ్గిస్తూ వచ్చారు. ప్రస్తుతం క్వింటాల్​కు  రూ.6 వేల నుంచి రూ.6,500, కొన్నిచోట్ల రూ.7 వేల వరకు కొంటున్నారు. నెలలోనే రూ.2 వేలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

తెరుచుకోని సీసీఐ సెంటర్లు

ఎంఎస్​పీ కంటే మార్కెట్​లో రేటు ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం రెండేళ్లుగా సీసీఐ సెంటర్లు ఏర్పాటు చేయడం లేదు. దిగుబడి పెరిగినా ఈసారి కూడా సెంటర్ల జాడలేదు. ఇదే అదునుగా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. మొదట్లో మంచి రేటు ఇచ్చి ఇప్పుడు డౌన్​ చేస్తున్నారు. ఇందేంటని రైతులు ప్రశ్నిస్తే పంట ఎక్కువగా వచ్చిందని, మాకు అవసరం లేకున్నా కొంటున్నామని కొందరు.. వర్షాల వల్ల పత్తి నల్లగా వచ్చిందని, తేమ శాతం ఎక్కువగా ఉందని మరికొందరు సాకులు చెప్తున్నారు. దీంతో తెంపిన పత్తిని రైతులు సంచుల్లోకి ఎత్తి ఇండ్లల్లోనే నిల్వ చేస్తున్నారు. ఈ రేట్లకు అమ్ముకుంటే పెట్టుబడులు కూడా రావని చెబుతున్నారు. రేట్లు పెరిగే వరకు ఇండ్లల్లోనే నిల్వ చేస్తామంటున్నారు.

పెట్టుబడి కూడా రాదు

నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. మొత్తం పత్తి వేసిన. దాదాపు రెండున్నర లక్షల వరకు పెట్టుబడి పెట్టా. దిగుబడి బాగానే వచ్చింది. 10 రోజుల కింద పత్తి తీసినం. బాదేపల్లి మార్కెట్​కు తీసుకుపోదామంటే రేట్​ లేదు. క్వింటాల్​కు రూ.6,500 కూడా ఇస్తలేరు. తీసిన మొత్తం పత్తిని సంచుల్లో నింపి ఇంట్లోనే ఉంచిన. రేట్​ వచ్చినంక అమ్ముతా.
– బంగారు, బోయిన్​పల్లి, మిడ్జిల్ మండలం

ఈ రేటుకైతే లాస్ అయితం 

నాకున్న రెండు ఎకరాల్లో పత్తి వేసిన. నిరుడు క్వింటాల్​పత్తికి రూ.8 వేలకుపైనే రేట్ కట్టిన్రు. ఈసారి రూ.7వేల లోపు వస్తదని అంటున్నరు. ఆ రేట్​ అయితే మాకు గిట్టుబాటు కాదు. ఈసారి పెట్టుబడి పెరిగింది. విత్తనాలు, మందులు రేట్లు మస్తు పిరమైనయి. కూలీల రేట్లు కూడా పెంచిన్రు. ఇప్పుడు అమ్ముకుంటే లాస్​అయితం. అందుకే ఇంట్లోనే పెట్టుకున్నాం. రేట్ ​పెరిగితే అమ్ముతాం.
– అంజమ్మ, బాలానగర్ మండలం