వాన బుగులుతో నష్టానికే అమ్ముకుంటున్న రైతులు

వాన బుగులుతో నష్టానికే అమ్ముకుంటున్న రైతులు
  • పూర్తిగా ఓపెన్​ కాని ఐకేపీ సెంటర్లు.. ఓపెన్​ అయిన చోట కొనుగోళ్లు అంతంతే
  • క్వింటాల్​కు 200 నుంచి 400 దాకా లాస్​
  • సెంటర్లు, కల్లాల్లో తడుస్తున్న వడ్లు
  • నెలరోజుల్లో సర్కారు కొన్నది 17శాతమే
  • కుప్పలపై కప్పేందుకు టార్పాలిన్లు కూడా లేవ్​
  • తిప్పలు పడుతున్న అన్నదాతలు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం ఒక వైపు.. చెడుగొట్టు వానలు మరో వైపు.. రైతులను గోసపెడుతున్నాయి. తుఫాన్​ ప్రభావంతో నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కల్లాలు, మార్కెట్లలోని వడ్లు తడిసిపోతున్నాయి. వాటిని ప్రభుత్వం ఎప్పుడు కొంటుందో తెలియక, ఇంకా అట్లనే ఉంచితే ఇంకింత తిప్పలైతదన్న ఆందోళనతో తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు రైతులు అమ్ముకుంటున్నారు.

క్వింటాల్​కు దాదాపు రూ. 400 లాస్​తో  ఇచ్చేస్తున్నారు. మరో మూడు నాలుగు రోజులు వర్షాలు పడే సూచనలు ఉండటంతో బుగులు పడుతున్నారు. అసని తుఫాను​ వల్ల ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
రైతుల ఆపతి.. దళారులకు ఆసరా
క్వింటాల్‌ వడ్లకు మద్దతు ధర రూ.1,960  దక్కాల్సి ఉండగా.. వాతావరణ పరిస్థితులు, రైతుల ఆపతిని దళారులు ఆసరాగా తీసుకుంటున్నారు. తక్కువ ధరలు నిర్ణయించి రైతులను దోచుకుంటున్నారు. ఇప్పటికే గత రెండ్రోజులుగా రెండు లక్షల క్వింటాళ్ల వడ్లు రూ. 200 నుంచి 400కు పైగా తక్కువ ధరకు రైతులు అమ్ముకున్నట్లు మార్కెటింగ్‌ శాఖ లెక్కలు చెప్తున్నాయి.

బుధవారం తిరుమలగిరి మార్కెట్‌లో 4,401 క్వింటాళ్ల ఆర్‌ఎన్‌ఆర్‌ రకం వడ్లను  రైతులు అమ్మేయగా.. కనిష్టంగా క్వింటాల్‌  రూ.1,409.. గరిష్టంగా రూ.1,769 వరకు ధర పలికింది. ఇదే మార్కెట్‌లో సోనమసూరి రకం వడ్లు 6,097 క్వింటాళ్లు అమ్మగా కనిష్టంగా క్వింటాల్‌ రూ.1,410.. గరిష్టంగా రూ. 1,629 ధర వచ్చింది.

నారాయణపేట మార్కెట్‌లో 1,048 క్వింటాళ్ల ధాన్యం రైతులు మార్కెట్‌లో అమ్ముకోగా కనిష్టంగా క్వింటాల్‌ రూ.1,360.. గరిష్టంగా రూ. 1,712 మాత్రమే ధర వచ్చింది. జగిత్యాలలోనూ జై శ్రీరాం ధాన్యం 1,468 క్వింటాళ్లు రైతులు అమ్మగా..  క్వింటాల్‌ కనిష్టంగా రూ.1,315.. గరిష్టంగా రూ.1,601 ధర దక్కింది. మంగళవారం  జనగాం మార్కెట్‌లో రైతులు 4,536 టన్నుల ఐఆర్‌ 64రకం ధాన్యం అమ్ముకుంటే క్వింటాల్‌కు  కనిష్టంగా రూ.1,201.. గరిష్టంగా రూ.1,605 మాత్రమే ధర పలికింది. సూర్యాపేటలో ఇదే రోజున ఇదే రకం వడ్లు రైతులు 2,317క్వింటాళ్లు అమ్మగా క్వింటాల్‌కు కనిష్టంగా రూ.1,401.. గరిష్టంగా రూ.1,601 ధరతో ప్రైవేటు వ్యాపారులు కొనుకున్నారు. వరి కోతల సీజన్‌ ప్రారంభంలో ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు ఉంటయో లేవో తెలియని ఆందోళనలో రైతులు ఉండగా..  క్వింటాల్‌ రూ.1,200 చొప్పున 10 లక్షల టన్నుల వడ్లను వ్యాపారులకు అమ్ముకొని మునిగారు.  
టార్గెట్‌లో ఇప్పటివరకు కొన్నది 17 శాతమే
ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోళ్లు ప్రారంభమై నెలవుతున్నా ఇప్పటి వరకు కొన్నది 17 శాతమే.  యాసంగి సీజన్‌లో 65 లక్షల టన్నుల వడ్లు కొనేందుకు సివిల్ సప్లయ్స్‌ శాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు 11 లక్షల టన్నులు మాత్రమే కొన్నది.  మార్చి చివరి వారంలో వరికోతలు మొదలు కాగా.. నెల ఆలస్యంగా అంటే ఏప్రిల్​ 15 నుంచే కొనుగోళ్లను సర్కారు స్టార్ట్​ చేసింది. మొత్తం 6,857 సెంటర్లు తెరుస్తామని చెప్పి ఇప్పటివరకు  5,774 సెంటర్లనే తెరిచింది. ఇందులో 3,760 సెంటర్లలోనే కొనుగోళ్లు మొదలయ్యాయి. వాటిలో కూడా నామమాత్రంగానే కొనుగోళ్లు జరుగుతున్నాయి.   
కొనుగోలు సెంటర్లలో తిప్పలు
ఐకేపీ కేంద్రాల్లో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కొనుగోళ్లు షురూ కాలేదు. ఎక్కడ చూసినా సెంటర్లలో, కల్లాల్లో వడ్ల కుప్పలు కనిపిస్తున్నాయి. ఆ వడ్లపై టార్పాలిన్లు కూడా లేకపోవడంతో వానకు తడిసి రైతులు ఆగమైతున్నారు. తడిసిన వడ్లను ఆరబెట్టుకునేందుకు సెంటర్లలో సరైన ఏర్పాట్లు కూడా లేవు. 4,958 పాడీ క్లీనర్లు ఉన్నాయని సర్కారు చెప్తున్నా.. సెంటర్‌కు ఒక్కటి కూడా లేదని రైతులు అంటున్నారు. తడిసిన వడ్లను ఆరబెట్టుకోవడం, మళ్లీ కుప్పచేయడం, వాటి దగ్గర  కాపలా ఉండటం.. రైతులకు అరిగోస అయితున్నది. 

తిప్పలైతున్నయ్​
మాకున్న మూడెకరాల పొలం కోసి వడ్లు ఎండబోసినం. మొగులు చూస్తే బుగులైతున్నది. ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో కొనుగోళ్లు చాల్​ కాక తిప్పలు పడుతున్నం. కిరాయికి పట్టాలు తెచ్చుకొని కుప్పల మీద కప్పుతున్నం. రాత్రి, పగలు కుప్పల దగ్గర్నే కావలి ఉంటున్నం.  ‑ చీర పద్మ, అర్పనపల్లి, కేసముద్రం మండలం, మహబూబాబాద్‌ జిల్లా