కొండపాక/గజ్వేల్/రాయపోల్, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో అంకిరెడ్డిపల్లి, బందారం, దుద్దేడ గ్రామాలకు చెందిన రైతులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ధర్నా కారణంగా రాజీవ్‌రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రైతులు మాట్లాడుతూ వారం రోజులుగా కొనుగోలు సెంటర్‌కు లారీలు రావడం లేదు, రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసిందని రైతులు ధర్నా నిర్వహిస్తున్నమని త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు వాగ్వాదానికి దిగారు. గజ్వేల్ మండలం అహ్మదీపూర్ లో వంటా వార్పుతో రైతులు నిరసన తెలిపారు. రాయపోల్ మండలం కొత్తపల్లి బస్టాండ్ వద్ద రైతులు ధర్నాకు దిగారు. సరిపడా లారీలను ఏర్పాటు చేయకపోవడంతో ధాన్యం కేంద్రాల్లోనే పేరుకుపోతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెదక్, వెలుగు: ధాన్యం కొనుగోలు, తూకం వేసిన ధాన్యం రైస్ మిల్లులకు తరలింపులో ఆలస్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షానికి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కొల్చారం మండలం చిన్న ఘనపూర్, చిలప్ చెడ్ మండలం చండూర్, కౌడిపల్లి మండలం వెంకట్రావ్ పేట, అల్లాదుర్గం మండల పరిధి ఐబీ చౌరస్తా, శివ్వంపేట మండలం చిన్న గొటిముక్కుల వద్ద, రామాయంపేట మండలం రాయిలాపూర్ స్టేజీ వద్ద, చిలప్ చెడ్ మండలం చండూర్ గేట్ వద్ద, తూప్రాన్ - వెల్దుర్తి రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు. అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హవేలి ఘనపూర్ మండలం సర్ధన గ్రామ రైతులు మెదక్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అడిషనల్కలెక్టర్ నగేశ్ ధాన్యం కొనుగోలు, తరలింపునకు చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
తహసీల్దార్ అడ్డగింత
హుస్నాబాద్(అక్కన్నపేట), వెలుగు: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రానికి తహసీల్దార్ మధుసూదన్‌ను కేంద్రం వద్దే అడ్డుకుని ధాన్యం తరలింపులో జాప్యంపై నిలదీశారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు సరిపడా లారీలు ఏర్పాటు చేయకపోవడంతో వడ్ల బస్తాలు కేంద్రంలోనే పేరుకుపోయాయన్నారు.
