పంటలు ఎండుతున్నా పట్టించుకోరా?

పంటలు ఎండుతున్నా పట్టించుకోరా?

పంటలు ఎండుతున్నా పట్టించుకోరా?
జనగామ కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన 
బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీళ్లు విడుదల చేయాలని డిమాండ్  

బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి సాగు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లాలోని గానుగుపహాడ్ ​రైతులు మంగళవారం కలెక్టరేట్​ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రతి ఎకరాకూ నీళ్లిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు.. పంటలు ఎండుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనగామ, వెలుగు: ‘‘పంటలు ఎండుతున్నా పట్టించుకోరా.. బొమ్మకూరు రిజర్వాయర్​నీళ్లను నమ్ముకొని నాట్లు వేస్తే నట్టేట ముంచుతారా?” అని అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనగామ మండలంలోని గానుగుపహాడ్​రైతులు మంగళవారం జిల్లా కలెక్టరేట్​ఎదుట ఆందోళన చేశారు. కలెక్టర్ ​సీహెచ్ శివలింగయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... ‘‘ప్రతి ఎకరాకూ నీళ్లిస్తం.. పంటలు ఎండిపోనివ్వమని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటలేదు. బొమ్మకూరు రిజర్వాయర్​నీటిని నమ్మకొని గానుగుపహాడ్​లో దాదాపు వెయ్యి ఎకరాల్లో నాట్లు వేసినం. పంట పొట్ట దశకు వచ్చింది. కానీ ఇప్పటికీ కాలువ నీళ్లు విడుదల చేస్తలేరు. ఎండల తీవ్రత పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి బావులు ఎండిపోతున్నాయి. దీంతో నీళ్లు అందక పొలాలు ఎండిపోతున్నాయి. రూ.వేలల్లో పెట్టుబడి పెట్టినం.. పంటలు ఎండిపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం” అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నీళ్లు విడుదల చేయాలని కోరారు.