అగ్రి బిల్లు లకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతన్న

అగ్రి బిల్లు లకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతన్న

అగ్రి బిల్లు లకు వ్యతిరేకంగా భారత్ బంద్

పంజాబ్, హర్యానాల్లో ఆందోళనలు తీవ్రం
రోడ్లపై భైఠాయింపు, రైల్వే ట్రాకులు బ్లాక్
ఢిల్లీ బార్డర్లో రైతుల అడ్డగింత
నిరసనలకు 18 ప్రతిపక్ష పార్టీల మద్దతు

న్యూఢిల్లీ, వెలుగు/నోయిడా/చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేశారు. వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. రోడ్లు, రైల్వే లైన్లను బ్లాక్ చేశారు. ఆలిండియా రైతు సంఘాల పిలుపు మేరకు శుక్రవారం భారత్ బంద్ చేపట్టారు. బంద్కు కాంగ్రెస్, ఆప్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ సహా 18 ప్రతిపక్షపార్టీలు మద్దతు తెలిపాయి. నిరసనల్లో 100కు పైగా రైతు సంఘాలు పాల్గొన్నట్లు ఆలిండియా కిసాన్ కో ఆర్డినేషన్ కమిటీ ప్రెసిడెంట్ భూపిందర్ సింగ్ మన్ చెప్పారు. రైతులను దోపిడీ చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

పంజాబ్ లో తీవ్రంగా ఆందోళనలు
పంజాబ్, హర్యానాలోని వేలాది మంది రైతులు ప్రొటెస్టుల్లో పాల్గొన్నారు. హైవేలు, రైల్వే ట్రాక్స్ ను బ్లాక్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పసుపు, ఆకుపచ్చ జెండాలు చేతబట్టుకుని రోడ్లపై బైఠాయించారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఆందోళనలు తీవ్రంగా జరుగుతున్నాయి. పంజాబ్ లో 31కి పైగా రైతు సంఘాలు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఆధ్వర్యంలో బంద్ లో పాల్గొన్నాయి. చాలా ప్రాంతాల్లో షాపులు, వ్యాపారాలు స్వచ్ఛందంగా మూతబడ్డాయి. బంద్ కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, సింగర్లు, కమిషన్ ఏజెంట్లు, కూలీలు, సోషల్ యాక్టివిస్టులు సపోర్ట్ పలికారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు అమృత్ సర్ లో నిరసన ర్యాలీ చేపట్టారు.

పలు రాష్ట్రాల్లో ఇలా..
ఇక కర్నాటకలోనూ రైతులు భారీగా ఆందోళనల్లో పాల్గొన్నారు. బెంగళూరులోకి వాహనాలు రాకుండా బార్డర్లలో అడ్డుకున్నారు. పశ్చిమ బెంగాల్ లో లెఫ్ట్ పార్టీలకు చెందిన రైతు సంఘాలు, అధికార టీఎంసీకి చెందిన సంఘాలు ప్రొటెస్టులు చేశాయి. ‘ప్రజా వ్యతిరేక వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోండి’ అంటూ డిమాండ్ చేశాయి. సీపీఎం రైతు వింగ్ సారా భారత్ కృషక్ సభ, సీపీఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ ఎస్పీ తదితర పార్టీల సంఘాలు జిల్లాలో ర్యాలీలు చేశాయి. రోడ్లను బ్లాక్ చేశాయి.
బీహార్లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఆధ్వర్యంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.
ఉత్తప్రదేశ్లోని నోయిడాలో ఢిల్లీ బార్డర్లో బీకేయూకు చెందిన వందలాది మంది రైతులు గుమిగూడారు. ప్రొటెస్టుల్లో భాగంగా కాలినడకన, బైకులపై, ట్రాక్టర్లపై అక్కడికి చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అల్లర్లు జరిగే ప్రమాదం ఉందన్న కారణంతో ఢిల్లీ వైపు వెళ్లకుండా రైతులను అడ్డుకున్నారు. నోయిడా–ఢిల్లీ మధ్య కీలక రోడ్డు కావడంతో రైతుల ఆందోళన కారణంగా భారీగా ట్రాఫిక్ జాం అయింది.
నేషనల్ సౌత్ ఇండియన్ రివర్ ఇంటర్ లింకింగ్ ఫార్మర్స్ అసోసియేషన్ రైతులు తమిళనాడులోని ట్రిచీలో కలెక్టర్ కార్యాలయం బయట పుర్రెలు పట్టుకుని, గొలుసులను చేతులు, మెడకు చుట్టుకుని నిరసన తెలిపారు. ఆలిండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో కేరళవ్యాప్తంగా ప్రొటెస్టులు జరిగాయి.

జంతర్ మంతర్ వద్ద ధర్నా
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రైతు సంఘాలు ధర్నా నిర్వహించాయి. శుక్రవారం ఆలిండియా కిసాన్ సంఘర్ష కో ఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్సీసీ) నేతృత్వంలో 250 సంఘాలు సంయుక్తంగా భారత్ బంద్కు పిలుపిచ్చాయి. ఈ ఆందోళనకు ప్రజా సంఘాలు, పొలిటికల్ పార్టీలు మద్దతు తెలిపాయి.

రైతులను బానిసలుగా మార్చే బిల్లులు: కాంగ్రెస్
కొత్త వ్యవసాయ బిల్లులు రైతులను బానిసలుగా మారుస్తాయని కాంగ్రెస్ ఆరోపించింది. ‘‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను జీఎస్టీ నాశనం చేసింది. ఇప్పుడు ఈ అగ్రి చట్టాలు మన రైతులను బానిసలను చేస్తాయి” అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు.. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను గుర్తుకు తెస్తున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విమర్శించారు. రైతులు తమ సొంత పొలాల్లోనే కూలీలు అవుతారని అన్నారు.

For More News..

పాకిస్తాన్ మమ్మల్ని జంతువుల్లా చూస్తోంది

కుక్క మొరిగిందా.. కరోనా ఉన్నట్టే.. అదేలాగంటే..

చెరువుల్ని మింగి సిటీని ముంచుతున్నరు