ఆశలు రేపుతున్న పత్తి, మిర్చి

ఆశలు రేపుతున్న పత్తి, మిర్చి
  • వానాకాలంలో పత్తి, మిర్చితో పాటు ఆయిల్పామ్ సాగుకు అన్నదాతల ఆసక్తి
  • పండ్లతోటలు, కూరగాయల సాగు పెరగవచ్చని అంచనా
  • సర్కారు సాయమందిస్తేనే రైతులకు మేలు

మంచిర్యాల, వెలుగు: పత్తి, మిర్చి పంటలు రైతుల్లో ఆశలు రేపుతున్నాయి. క్వింటాల్ పత్తికి​రూ.14 వేలు.. మిర్చి రకాన్ని బట్టి రూ. 30 వేల నుంచి రూ.50 వేల వరకు రికార్డు స్థాయిలో రేటు పలుకుతుండడంతో ఈ వానాకాలం పెద్దఎత్తున సాగు చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వ సూచనలతో ఆయిల్​ఫామ్​సాగుపైనా ఆసక్తి చూపుతున్నారు. కొవిడ్​తర్వాత  పప్పు దినుసులు, నూనె గింజలు, ఉద్యాన పంటలకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతుండడంతో వాటి సాగు కూడా పెరుగుతుందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్​లో 1.60 కోట్ల ఎకరాల్లో వివిధ పంటల సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందులో 75 లక్షల ఎకరాల్లో పత్తి, 45 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో కంది, 11.5 లక్షల ఎకరాల్లో ఉద్యానపంటలు సాగవుతాయని అంచనా. రాష్ట్ర సర్కారు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడంతో పాటు మార్కెటింగ్​కు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తే మరింత ఉత్సాహంగా సాగుకు రెడీ అవుతామని అన్నదాతలు అంటున్నారు. 


75 లక్షల ఎకరాల్లో పత్తి
రాష్ట్రంలో ప్రధాన పంటగా పత్తి పండిస్తున్నారు. సాగునీటి వసతి లేని ప్రాంతాల్లో మెజారిటీ రైతులు వర్షాధారంగా సాగు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ (ఎమ్మెస్పీ) ప్రకటించడం, మార్కెట్​లో ఒడిదుడుకులు ఎదురైనా మద్దతు ధర లభించడంతో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. 2014లో 42 లక్షల ఎకరాల్లో పత్తి పండించగా, 2019లో 54.50 లక్షల ఎకరాలు, 2020లో 60.53 లక్షల ఎకరాలు, 2021లో 75 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈసారి కూడా 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా. నిరుడు భారీ వర్షాలు, వరదలు, తెగుళ్ల కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గింది. సాధారణ దిగుబడి ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్లకు గాను మూడు నాలుగు క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్​లో డిమాండ్ పెరగడంతో రికార్డు స్థాయిలో ధర పలికింది. తాజాగా వరంగల్ ఎనుమాముల మార్కెట్​లో క్వింటాలుకు రూ.14 వేలు దక్కడం విశేషం. కానీ పత్తి సాగులో రైతులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. నకిలీ విత్తనాలు, తెగుళ్లు, చీడపీడలు, కూలీల కొరత,  పంట చేతికొచ్చాక దళారుల బెదడ సమస్యగా ఉంది. ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగులు మందులు సరఫరా చేయడంతోపాటు క్రాప్​లోన్లు అందించాలని రైతులు కోరుతున్నారు. 


నూనె గింజలకు డిమాండ్
నూనె గింజల ఉత్పత్తిలో మన దేశం చాలా వెనుకంజలో ఉంది. కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్​ పామ్​సాగు దిశగా రైతులను ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ జిల్లాల్లో ఆయిల్​పామ్​ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ  రెండు జిల్లాల్లో కలిపి సుమారు 45 వేల ఎకరాల్లో పండిస్తున్నారు. రానున్న రోజుల్లో ఆయిల్​ పామ్ సాగును 25 లక్షల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు రైతులకు సబ్సిడీ ఇస్తోంది. ఈ మొక్కలు నాటిన ఐదేండ్ల నుంచి 30 సంవత్సరాల వరకు దిగుబడినిస్తాయి. ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం వస్తుంది. అంతర పంటలు కూడా వేసుకోవచ్చు. దీంతో చాలామంది రైతులు ఆయిల్​పామ్​సాగుకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు గతంలో తెలంగాణలో సగటున 5 లక్షల ఎకరాల్లో సాగయ్యే పల్లి గతేడాది 50 వేల ఎకరాలకే పరిమితమైంది. 3.75 లక్షల ఎకరాల్లో సాగయ్యే పెసర1.56 లక్షల ఎకరాలకు, 7.5 లక్షల ఎకరాల్లో సాగయ్యే సోయాబీన్ 1.33 లక్షల ఎకరాల్లోనే వేశారు. 14 లక్షల ఎకరాల్లో సాగయ్యే మక్క గతేడాది 2.27 లక్షల ఎకరాలకు పరిమితమైంది.  పసుపు లక్ష ఎకరాలకు మించలేదు. మూడు, నాలుగేండ్లుగా రైతులంతా వరి వైపు మళ్లడం వల్లే ఇతర పంటలు తగ్గుతూ వస్తున్నాయి. కాగా, గడిచిన రెండు సీజన్లలో వడ్లను కొనడంలో సమస్యలు ఏర్పడుతుండడంతో రైతులు ఈసారి  ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్నారు. పప్పు దినుసుల కొరత నేపథ్యంలో సర్కారు ఈసారి కంది సాగుపై దృష్టి పెట్టింది. 2020లో 10.80 లక్షల ఎకరాల్లో, 2021లో 13 లక్షల ఎకరాల్లో కంది సాగైంది. ఈసారి సాగు విస్తీర్ణం 15 లక్షల ఎకరాలకు పెంచాలని ప్రణాళిక సిద్ధం చేసింది.  రైతులు ఈ దఫా మరింత ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేసే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే వినియోగదారులకు కూడా మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


మిర్చి ఎర్ర బంగారమే..
రాష్ట్రంలో మరో ప్రధానమైన వాణిజ్య పంట మిర్చి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సుమారు 2.5 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో 50 వేల ఎకరాలలోపే సాగవుతోంది. గతంలో గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి మిర్చి రేటు అనూహ్యంగా పెరిగింది. వరంగల్ ఎనుమాముల మార్కెట్​లో రికార్డు స్థాయిలో దేశీ మిర్చి క్వింటాలుకు రూ.50 వేలు పలికింది. సీజన్ ప్రారంభంలో మిర్చి రకాలను బట్టి ట్రేడర్లు రూ.20 వేల నుంచి రూ.30 వేలు చెల్లించారు. సరిపడా కోల్డ్​ స్టోరేజీలు లేకపోవడంతో మిర్చి ఒక్కసారిగా మార్కెట్​లోకి వచ్చినప్పుడు దళారులు రేట్లు తగ్గిస్తున్నారు. ఈ సమస్యకు సర్కారు పరిష్కారం చూపాల్సి ఉంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పటికీ ఈసారి అదనంగా  50 వేల నుంచి లక్ష ఎకరాల్లో రైతులు అదనంగా మిర్చి సాగు చేస్తారని భావిస్తున్నారు. 


పత్తికి ఖర్చు ఎక్కువైనా కాలం కలిసొచ్చి మంచిగ పండితే లాభం వస్తుంది. ప్రస్తుతం పత్తి క్వింటాలుకు 8 నుంచి 10 వేల రేటు పలుకుతోంది. అందుకే ఈసారి ఇరవై ఎకరాలు కౌలు పట్టి పత్తి పెడుతున్న. ప్రభుత్వం ఈసారి కూడా మంచి రేటు ఇప్పించాలె. 
– పోటు భాస్కర్​రెడ్డి, కౌలురైతు, భీమారం, మంచిర్యాల

ఆరెకరాల భూమి ఉంది. చాలా ఏండ్ల నుంచి మిర్చి పండిస్తున్న. నిరుడు రెండెకరాల్లో దొడ్డు రకం, మరో రెండెకరాల్లో సన్నరకం మిర్చి వేసిన. రెండెకరాల్లో ఆయిల్​పామ్​తోట పెట్టిన. వాతావరణం అనువుగా ఉంటే మిర్చి ఎకరానికి 30 క్వింటాళ్లు వస్తది. పెట్టుబడి ఎకరానికి లక్ష రూపాయలు అయితది. ఈయ్యేటి లెక్క మార్కెట్ల మంచి రేటు ఉంటే ఖర్చులు పోను ఎకరానికి రెండు లక్షలు మిగుల్తయి. కానీ నిరుడు మిర్చి పంటకు నల్లి సోకి నష్టం వచ్చింది. ఈసారి కూడా మిర్చి పంటే  పెడుతున్న. 
– రాజబాపు, రాంపూర్, మంచిర్యాల