రైతు ఉద్యమానికి ఆర్నెళ్లు పూర్తి

రైతు ఉద్యమానికి ఆర్నెళ్లు పూర్తి

రైతులకు కనీస మద్దతు ధర లభించాలని కేంద్రం తీసుకొచ్చిన అగ్రిచట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మొదలైన రైతు ఉద్యమానికి నేటితో ఆరు నెలలు పూర్తయ్యాయి. దాంతో రైతులు నేడు ‘బ్లాక్ డే’గా పాటిస్తున్నారు. రైతులు ఏ ప్రాంతం వాళ్లు అక్కడే ఉండి నల్లజెండాలు ఎగరేస్తున్నారు. గ్రామాలు మొదలుకొని ఢిల్లీ దాకా ఇళ్లు, దుకాణాలపై నల్లజెండాలు ఎగరేస్తున్నారు. వాహనాలకు నల్లజెండాలు కట్టి రైతులకు మద్దతు తెలుపుతున్నారు. రైతుల ఆందోళనలతో ముందు జాగ్రత్తగా ఢిల్లీ సరిహద్దుల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సింఘూ, టిక్రీ సహా ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఢిల్లీలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. 

కాగా.. రైతుల ఉద్యమం మొదలై ఆరునెలలు గడిచినా కేంద్రం పట్టించుకోవడంలేదని భారతీయ కిసాన్ యూనియన్ లీడర్ రాకేశ్ తికాయత్ అన్నారు. చట్టాలు రద్దు చేసేంత వరకు ఇలాగే శాంతియుతంగా నిరనస కొనసాగిస్తామని ఆయన తెలిపారు. బ్లాక్ డే సందర్భంగా ఎవరూ ఢిల్లీ సరిహద్దులకు రావడం లేదని.. ఎక్కడివారు అక్కడే ఉండి నిరసన తెలుపుతున్నారని ఆయన అన్నారు. 

గతేడాది నవంబర్ 26న ఛలో ఢిల్లీ కార్యక్రమంతో రైతుల ఉద్యమం మొదలైంది. అగ్రిచట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాల నేతలు డిసెంబర్ 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. జనవరి 12న అగ్రి చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దాంతో జనవరి 20న అగ్రి చట్టాలను 18 నెలల పాటు నిలిపేసేందుకు కేంద్రం అంగీకరించింది. కేంద్రంతో పలుమార్లు రైతు సంఘాల చర్చలు జరిగినా అవన్నీ విఫలమయ్యాయి. జనవరి 22న చివరగా రైతులు, కేంద్రం మధ్య చర్చలు జరిగాయి. జనవరి 26 రిపబ్లిక్ డే నాడు రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. కొందరు ఆందోళనకారులు ఎర్రకోటపై మత జెండాను ఎగురేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

ఢిల్లీ సరిహద్దుల్లో గతేడాది మొదలైన రైతుల ఉద్యమం ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోంది. ఎండావాన, చలిని లెక్క చేయకుండా శాంతియుత పద్ధతిలో రైతులు నిరసన తెలుపుతున్నారు. ఉద్యమంలో ఎన్నోసార్లు ఘర్షణలు జరిగినా.. రైతులు మాత్రం వెనక్కి తగ్గలేదు. చివరకు రైతులుంటున్న గుడారాలకు కరెంట్, వాటర్ సప్లయ్ కూడా నిలిపేశారు. చాలామందిపై కేసులు కూడా పెట్టారు. అయినా రైతులు మాత్రం తమ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు.