
- రైతు వేదికలు అక్కరకొస్తలే!
- ఎప్పుడూ తాళాలే.. అటకెక్కిన అసలు ఉద్దేశం
- నెలకు ఇస్తానన్న రూ.9 వేలూ ఇవ్వట్లే
- రైతు ఉత్సవాల కోసం హడావుడిగా ఓపెన్
- ‘ప్రజా వేదిక’లుగా మార్చేందుకు సన్నాహాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రైతు వేదికలు అక్కరకు రాకుండా పోతున్నాయి. రైతుల ఆదాయం పెంచేందుకు, పంటలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కట్టించిన ఈ వేదికలు ఎప్పుడూ తాళాలు వేసే ఉంటున్నాయి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన రైతు ఉత్సవాల కోసం మాత్రం వీటిని తెరిచారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.573 కోట్లతో 5 వేల హెక్టార్ల (సుమారు 12,500 ఎకరాలు) వ్యవసాయ భూమి ఒక క్లస్టర్‌గా 2,604 రైతు వేదికలను నిర్మించారు. ఒక్కో దానికి రూ.22 లక్షలు ఖర్చు చేశారు. అందులో వ్యవసాయ శాఖ వాటా రూ.12 లక్షలు కాగా, మరో రూ.10 లక్షలు ఉపాధి హామీ నిధులు. వాటన్నింటికీ టీవీలు, ఇంటర్నెట్, మౌలిక వసతులు కల్పిస్తామని సీఎం కేసీఆర్ అప్పట్లో చెప్పారు.
కానీ, ఇప్పటికీ చాలా రైతు వేదికలకు కరెంట్ కనెక్షనే ఇవ్వలేవు. సగం వేదికల్లో మంచినీళ్ల వసతి, మరుగుదొడ్లు లేదు. ఫర్నిచర్ తప్ప టీవీ, ఇంటర్నెట్ సౌకర్యమూ చాలా వాటికి ఇవ్వలేదు. ప్రహరీలు లేకపోవడంతో కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు వేదికలుగా మారుతున్నాయి. మరోవైపు రైతు వేదికల్లో కరెంట్బిల్లులు పేరుకుపోతున్నాయి. ప్రతి రైతు వేదిక నిర్వహణకు నెలకు రూ.9 వేల చొప్పున చెల్లిస్తామని నిరుడు డిసెంబర్లో మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. తొలి నెల నిధులు విడుదలైనా.. ఆ తర్వాతి నుంచి రావడం లేదని చెప్తున్నారు.
అసలు ఉద్దేశం ఎటుపోయింది?
భూసార పరీక్షలు చేసి ఏ పంట వేయాలో సూ చించడం, ఎరువుల మోతాదు, పంట మార్పిడి, నష్ట నివారణ, అమ్మకం తదితర విషయాలపై రైతులకు అవగాహన కల్పించడం కోసం రైతు వేదికలను ఏర్పాటు చేశారు. రెండు వారాలకోసారి రైతుబంధు సమితులు రైతులతో సమావేశమవ్వాలని తొలుత చెప్పారు. కానీ, నెలకోసారి కూడా మీటింగ్స్ జరగట్లేదు. అయితే రైతు వేదికల ద్వారా పెద్దగా ఉపయోగం లేదని గ్రహించిన వ్యవసాయ శాఖ కొత్త ఆలోచన చేసింది. వీటిని ఖాళీగా వదిలేయకుండా ఇతర ప్రభుత్వ శాఖల సమావేశాల నిర్వహణకు ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం రైతు వేదికలను ‘ప్రజా వేదికలు’గా మార్చాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అధికారులకు అంతర్గత ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. దళితబంధు, ఆసరా పెన్షన్లు, షాదీముబారక్, కల్యాణ లక్ష్మి తదితర పథకాలపై లబ్ధిదారులకు రైతు వేదికల్లోనే అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
ఆదాయ వనరుగా మార్చాలన్న ప్రతిపాదన
రైతు వేదికలను ఆదాయ వనరుగా మార్చుకుంటే బాగుంటుందని పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రతిపాదిస్తున్నట్టు తెలిసింది. రైతు సమితి సమావేశాలు జరగనప్పుడు ప్రైవేటు ఫంక్షన్లకు కిరాయికివ్వాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచిస్తున్నట్టు సమాచారం. పుట్టినరోజు, పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అద్దెకిస్తే వాటి నిర్వహణ ఖర్చుల భారం తగ్గి ఆదాయం సమకూరుతుందన్న వాదనను వినిపిస్తున్నట్టు చెప్తున్నారు. అయితే, ప్రస్తుతానికి ఆ ప్రతిపాదనను వ్యవసాయ శాఖ వ్యతిరేకించినట్టు సమాచారం.
‘ప్రపంచంలోనే రైతు వేదికలు ఎక్కడా లేవు. మనమే కట్టుకుంటున్నం. రైతు వేదిక ఒక ఆటంబాంబు. అంతకు మించిన శక్తి. రైతు వేదికల ద్వారా రైతులందరినీ ఒక్కటి చేసి.. వ్యవసా యంలో మంచి విజయం సాధిస్తం. రైతులను బాగు చేస్తం. విత్తనాల దగ్గర నుంచి ఎరువుల దాకా.. పంట పండించే దగ్గర్నుంచి అమ్ముకునేదాకా అన్నిటికీ ఈ వేదికలు ఉపయోగపడతయ్.’
‑ 2020 అక్టోబర్ 31న జనగామ
జిల్లా కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్