ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు

ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు
  • హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌లో కిలోమీటర్ మేర బారులు తీరిన ట్రాక్టర్లు
  • కాంటాల కోసం పది రోజులుగా రైతుల ఎదురుచూపులు
  • 40 కిలోల బస్తాకు ఐకేపీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 కిలోలు, రైస్ మిల్లుల్లో 3 కిలోల తరుగు తీస్తున్న నిర్వాహకులు 

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ఐకేపీ సెంటర్లకు వడ్లు తీసుకొచ్చినా.. తేమ పేరుతో కాంటా పెట్టడం లేదు. మరికొన్ని చోట్ల కాంటా అయిన బస్తాలను రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లులకు తీసుకుపోతే, అన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేయడం లేదు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని పలు ఐకేపీ కేంద్రాల్లో, రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లుల వద్ద రైతులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. వడ్లు తెచ్చి పది రోజులైనా ఐకేపీ సెంటర్లలో కాంటా పెట్టడం లేదని చెబుతున్నారు. మరికొన్ని చోట్ల ట్రాక్టర్లలో రైస్ మిల్లులకు వడ్లను తీసుకుపోతే, అన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయడం లేదని వాపోతున్నారు. దీంతో రెండు, మూడ్రోజులుగా రైస్ మిల్లుల బయటే ట్రాక్టర్లను నిలిపి ఎదురుచూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలోని సైదాపూర్, హుజూరాబాద్, శంకరపట్నం మండలాల్లోని పలు ఐకేపీ సెంటర్లలో కాంటా పెట్టిన ధాన్యాన్ని.. హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఓ రైస్ మిల్లుకు బుధవారం తరలించగా శుక్రవారం వరకు అన్‌‌‌‌‌‌‌‌లోడింగ్ కాలేదు. దీంతో ఈ రైస్ మిల్లు ఎదుట సుమారు కిలోమీటర్ మేర ట్రాక్టర్లు నిలిపోయాయి. 

తరుగు, తేమ పేరిట దోపిడీ.. 

రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించిన ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఒక్కోచోట ఒక్కో విధంగా తరుగు తీస్తున్నారు. 40 కిలోల బస్తాకు కొన్ని చోట్ల కిలో తీస్తుండగా.. మరికొన్ని చోట్ల 2 కిలోలు తరుగు తీస్తున్నారు. కాంటా వేసినప్పుడు 41 కిలోలు, 42 కిలోలు ఉండేలా నిర్వాహకులు చూస్తున్నారు. రైస్ మిల్లుకు తీసుకెళ్లాక అక్కడ మరో రెండు, మూడు కిలోల వరకు తరుగు తీస్తున్నారు. దీంతో ఒక్కో రైతు 40 కేజీల బస్తాపై నాలుగైదు కేజీలు తరుగు రూపంలో కోల్పోవాల్సి వస్తున్నది. రామడుగు మండలం తిరుమలాపూర్ కొనుగోలు కేంద్రంలో తేమ శాతం ఉన్న వడ్ల కొనుగోళ్లను శుక్రవారం ప్రారంభించారు. కానీ, తూకంలో 40 కేజీల బస్తాకు రెండు కిలోల 200 గ్రాములు అదనంగా తూకం వేస్తామని నిర్వాహకులు చెప్పడంతో రైతులు అభ్యంతరం తెలుపుతూ కొనుగోళ్లను నిలిపివేయించారు. అలాగే, ఇల్లందకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లలో కొనుగోళ్లు జరగడం లేదు. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పడంతో, పది రోజులుగా రైతులు వడ్ల కుప్పల వద్దనే పడిగాపులు కాస్తున్నారు.

10 క్వింటాళ్ల తరుగు తీశారు.. 

సైదాపూర్ ఐకేపీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంటా అయ్యాక గురువారం ఉదయం హుజూరాబాద్ రైస్ మిల్లు వద్ద ట్రాక్టర్లను లైన్‌‌‌‌‌‌‌‌లో పెట్టిన. శుక్రవారం సాయంత్రం అన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసి రైస్ మిల్లులో కాంటా పెట్టారు. 40 కిలోల బస్తాకు 43 కిలోల చొప్పున కాంటా వేశారు. రెండు ట్రాక్టర్లలో 62.25 క్వింటాళ్ల లోడ్‌‌‌‌‌‌‌‌తో వస్తే, రైస్ మిల్లులో కాంటా వేశాక 57 క్వింటాళ్లకు తగ్గింది. ఇలా 10 క్వింటాళ్ల వడ్లు తరుగు తీయడంతో రూ.20 వేలు నష్టం వచ్చింది.  
- వీరస్వామి, రైతు, సైదాపూర్