మొగులు చూస్తే బుగులు.. అకాల వర్షాలతో రైతుల ఆందోళన

మొగులు చూస్తే బుగులు..  అకాల వర్షాలతో రైతుల ఆందోళన
  •     భారీ వర్షాలకు దెబ్బతింటున్న పంటలు 
  •     మరో ఐదు రోజులు వానలు
  •     18 జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్, వెలుగు: అకాల వర్షాలతో రైతులు ఆగమవుతున్నరు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే టైమ్​లో చెడగొట్టు వానలతో దెబ్బతింటుండడంతో ఆవేదన చెందుతున్నరు. మొగులును చూసి ఎప్పుడు వానస్తదోనని బుగులు పడుతున్నరు. గత మూడు రోజులుగా వడగండ్లు, గాలి దుమారంతో కురుస్తున్న వానలతో పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 

ఇటీవల కురిసిన అకాల వర్షాలకు 3,120  ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు గుర్తించారు. రంగారెడ్డి, జనగామ, నిర్మల్ జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నట్టు నిర్ధారించారు. ఈ యాసంగిలో ఇప్పటి వరకు రాష్టవ్యాప్తంగా దాదాపు 20 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 15 వేల ఎకరాలకు సంబంధించిన లెక్కలు తేల్చిన వ్యవసాయ శాఖ ఆ రిపోర్టును ప్రభుత్వానికి పంపించింది. 

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పంట నష్ట పరిహారం విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతి కోరింది. కాగా, తాజాగా జరిగిన పంట నష్టం వివరాలనూ వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. రైతులందరికీ ఒకేసారి పరిహారం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

వాతావరణ శాఖ హెచ్చరికలు.. 

రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ  ఆదివారం హెచ్చరించింది. రాష్ట్రంలోని 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్​జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల వీచే అవకాశం ఉందని పేర్కొంది.

 సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మంగళవారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్​భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్​, మేడ్చల్​ మల్కాజిగిరి, మహబూబ్​నగర్​, నాగర్​కర్నూల్​, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్​జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

 వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు బుగులు పడుతున్నరు. మూడ్రోజుల కింద మబ్బులు పట్టి చిరుజల్లులతో మొదలైన వర్షం.. శుక్రవారం అర్ధరాత్రి, శనివారం పలు జిల్లాల్లో భారీగా కురిసింది. ఆదివారం సైతం అక్కడక్కడ వానలు పడ్డాయి. దీంతో పలు జిల్లాల్లో కోతకు వచ్చిన పంటలు నేలపాలయ్యాయి.