సిటీ శివారులోని గ్రామాల్లో పుట్టగొడుగుల్లా ఫాంహౌస్​లు

సిటీ శివారులోని గ్రామాల్లో పుట్టగొడుగుల్లా ఫాంహౌస్​లు

శామీర్ పేట, వెలుగు: సిటీ శివారులోని గ్రామాల్లో పుట్టగొడుగుల్లా ఫాంహౌస్​లు వెలుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి 30 – 40 కిలోమీటర్ల పరిధిలో మరీ ఎక్కువయ్యాయి. గ్రామ పంచాయతీల నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ దత్తత మండలమైన మూడు చింతలపల్లిలోని లింగాపూర్, ఉద్దేమర్రి గ్రామాల్లో ఎటుచూసినా ఈ తరహా నిర్మాణాలే కనిపిస్తున్నాయి.

ఈ గ్రామాలైతే భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతాయనే ఆలోచనతో గుంటలు, ఎకరాల చొప్పున భూములు కొంటున్నారు. వాటిలో ఫాంహౌస్ లు కట్టి వీకెండ్​పార్టీలకు, ఫంక్షన్లకు అద్దెకు ఇస్తున్నారు. మరికొందరు ఒక్కో ఫాంహౌస్​ను రూ.75లక్షలకు అమ్మేస్తున్నారు. కాగా ఫాంహౌస్​లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని  స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేస్తే నోటీసులు ఇచ్చి సరిపెడుతున్నారు. పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా నిర్మిస్తున్నా, ఇంటి నంబర్లు ఇచ్చి అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ విషమయమై డీపీఓ రమణమూర్తిని వివరణ కోరగా అక్రమ నిర్మాణాలను గుర్తించి, చర్యలు తీసుకుంటామని తెలిపారు.